PBKS vs CSK: వికెట్ల వేటలో పంజాబ్ సక్సెస్.. ఢీలా పడిన చెన్నై బ్యాటర్లు

PBKS vs CSK: వికెట్ల వేటలో పంజాబ్ సక్సెస్.. ఢీలా పడిన చెన్నై బ్యాటర్లు

ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ధర్మశాల పిచ్ పై 170 పరుగులూ దాటలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై.. 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. శివమ్ దూబే(0), ఎంఎస్ ధోని(0) డకౌట్ కాగా.. రుతురాజ్ గైక్వాడ్ (32), డారిల్ మిచెల్ (30), రవీంద్ర జడేజా(26 బంతుల్లో 43) పర్వాలేదనిపించారు.   

టాస్ ఓడి బ్యాటింగ్‪కు దిగిన చెన్నై.. ఆదిలోనే అజింక్యా ర‌హానే(9) వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్‌ ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించిన రహానే.. రబాడకు దొరికిపోయాడు. ఆ తరువత క్రీజులోకి డారిల్ మిచెల్ (30).. రుతురాజ్‌తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నిర్మించాడు.  వీరిద్దరి ధాటికి చెన్నై.. పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఆ సమయంలో స్ట్రాటజిక్‌ టైమౌట్‌ తీసుకున్న పంజాబ్.. తిరిగి ఆట ప్రారంభం కాగానే వికెట్ల వేట మొదలు పెట్టింది. 

రాహుల్ చాహర్ వేసిన 8వ ఓవర్ మొదటి బంతికే రుతురాజ్ (32) ఔటయ్యాడు. ఆ మరుసటి బంతికి శివమ్‌ దూబె (0) పెవిలియన్‌ చేరాడు. హర్షల్ పటేల్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో డారిల్ మిచెల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో చెన్నై 75 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో రవీంద్ర జడేజా 43; 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టును ఆదుకున్నాడు. మొయిన్ అలీ (17) వెనుదిరిగినా.. మిచెల్ సాంట్నర్(11), శార్దూల్ ఠాకూర్(17) సాయంతో విలువైన పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.