Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్‌ వేటు.. పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రశ్నార్థకం!

Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్‌ వేటు.. పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రశ్నార్థకం!

భారత స్టార్ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియాపై సస్పెన్షన్ వేటు పడింది. ఒలింపిక్ ట్రయల్స్ సమయంలో డోపింగ్ శాంపిల్స్ ఇవ్వనందుకు నేషనల్ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (NADA) అతన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 10న సోనేపట్‌లో జరిగిన సెలక్షన్ ట్రయల్స్ కోసం పునియా తన మూత్రం నమూనాను అందించడంలో విఫలమయ్యాడు. దీంతో నాడా.. అతన్ని భవిష్యత్తులో జరిగే ఈవెంట్లలో పాల్గొనకుండా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు జాతీయ యాంటీ డోపింగ్ సంస్థ నాడా.. డోపింగ్‌ పరీక్షలు నిర్వహిస్తుంది. అందుకోసం మార్చి 10న పూనియా నుంచి యూరిన్‌ శాంపిల్స్‌ కోరగా.. అతను నిరాకరించాడని నాడా తెలిపింది. డోప్-కలెక్టింగ్ అధికారి నివేదిక ప్రకారం.. అతను తిరస్కరిస్తే డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు వార్నింగ్ ఇవ్వబడుతుందని తెలియజేసినప్పటికీ అతను వెళ్లిపోయాడని పేర్కొంది. NADR 2021లోని ఆర్టికల్ 7.4 ప్రకారం, ఈ విషయంలో విచారణలో తుది నిర్ణయం తీసుకునే ముందు బజరంగ్ పునియా వెంటనే ఏదేని పోటీల్లో పాల్గొనకుండా తాత్కాలికంగా సస్పెండ్ చేయబడిందని నాడా వెల్లడించింది.

సస్పెన్షన్ వేటు నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి కాంస్య పతకాన్ని సాధించిన పునియా, ఈ నెలాఖరులో జరగనున్న సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనకుండా నిరోధించబడే అవకాశం ఉంది. 65 కేజీల విభాగంలో ఇప్పటి వరకు ఏ భారతీయుడు కూడా ఒలింపిక్ కోటాను గెలుచుకోలేదు.

నిరాకరించలేదు.. 

తనపై సస్పెన్షన్ విధించిన నేపథ్యంలో పూనియా స్పందించారు. తన నమూనాలను నాడా అధికారులకు ఇవ్వడానికి తానెప్పుడూ నిరాకరించలేదని తెలిపాడు. గడువు ముగిసిన డోప్-సేకరణ కిట్లపై వారు ఏ చర్య తీసుకున్నారో ముందుగా నాకు సమాధానం చెప్పమని అభ్యర్థించానని వెల్లడించాడు. "నా శాంపిల్ తీసుకోండి, ఆపై నా లాయర్ విదుష్ సింఘానియా ఈ లేఖకు సమాధానం ఇస్తారు.." అని బజరంగ్ తన ఎక్స్ హ్యాండిల్ నుండి పోస్ట్ చేశాడు. డోప్-సేకరణ కిట్‌ల గడువు ముగిసినట్లు పేర్కొంటూ కొన్ని నెలల ముందు పునియా ఒక వీడియో విడుదల చేశారు.