నా వెంట ఉండే వాళ్లపై హరీశ్ అక్రమ కేసులు పెట్టిస్తుండు

నా వెంట ఉండే వాళ్లపై హరీశ్ అక్రమ కేసులు పెట్టిస్తుండు

హుజురాబాద్  సింగపూర్ గెస్ట్ హౌస్ లో కూర్చుని హరీశ్ రావు కుట్రలు చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. నీతో పాటు 18 ఏళ్లు పనిచేసాను.. నీవెళా ఉద్యమకారుడివో.. నేను కూడా ఉద్యమ కారున్నే అంటూ హరీశ్ రావుకు గుర్తు చేశారు.ఇలాంటి నికృష్టమైన, నీచమైన పనులు చేసి.. తెలంగాణ ప్రజల దృష్టిలో చిల్లర కాకు అంటూ సూచించారు. అంతేకాదు..నీవు, నీ ముఖ్యమంత్రి గాడు చెప్పండి.. నీకు ఏమాత్రం రోషం, ఆత్మగౌరవమున్నా ఒక్క బిల్లన్నా సొంతంగా చెల్లించగలవా? అంటూ ప్రశ్నించారు. ఫైనాన్స్ మినిస్టర్ అంటే ప్లానింగ్ కూడా ఉండాలి... నీకు ప్లానింగే లేదు. కేవలం ఫైనాన్స్ మినిస్టర్ వు మాత్రమే నీవు అని అన్నారు.

 హుజురాబాద్ మధువని గార్డెన్ లో బీజేపీలో చేరికల కార్యక్రమంలో పాల్గొన్న ఈటల.. నీ బ్రోకర్ మాటలు ఎవరూ నమ్మరంటూ మంత్రి హరీశ్ రావు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను మంత్రి పదవి తీసేసినప్పుడు నాపై దళితుల భూముల ఆక్రమించుకున్నాడని చెప్పారు.ఇప్పుడేమో.. ఈటల  సీఎం కుర్చీకి ఎసరు పెట్టాడని ఇక్కడ మహిళలతో చెబుతున్నాడు. హరీశ్ రావు నాపై చేసిన ఆరోపణలు నిజమేనని గుండెలపై చేయి వేసుకుని చెప్పగలవా? అని ప్రశ్నించారు.

నేను మీలాగా రాజకీయ వారసుల కుటుంబం నుంచి రాలేదన్న ఈటల..నాకు నేనుగా వచ్చి ఉద్యమంలో నిలబడి ఎదిగిన వాడినని తెలిపారు. కేవలం ఈర్ష్యతో నన్ను తొక్కెయ్యాలని చూస్తున్నారని చెప్పారు.కరీంనగర్ సీపీ స్వయంగా సీఐలకు పోలీసులకు ఫోన్ చేసి వాళ్లను, వీళ్లను పట్టుకురమ్మని ఆదేశిస్తున్నాడట అని తెలిపారు. నీవు తొత్తువు కావచ్చు కమిషనర్…. మా కానిస్టేబుల్స్, ఎస్సైలు, సీఐలు మాత్రం తొత్తులు కాదు అన్నారు.  మీ పాలనకు చరమగీతం పాడబోతున్నారని.. హుజురాబాద్ ఫలితం చెప్పబోతోందన్నారు.

ఈటల వెంట ఉండేవాళ్ల ట్రాక్టర్లను బలవంతంగా వాగులోకి తీసుకెళ్లి ఇసుక నింపి కేసులు పెట్టాలని హరీశ్ ఆదేశిస్తున్నాడని.. ఇక్కడి సింగాపూర్ గెస్ట్ హౌస్ లో కూర్చుని పోలీసులకు ఆర్డర్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు బానిసల్లాగా కాకుండా చట్టబద్ధంగా పనిచేయాలన్నారు.