డిపాజిట్‌ దక్కకున్నా తగ్గేదేలే!

డిపాజిట్‌ దక్కకున్నా తగ్గేదేలే!
  •     లోక్‌సభ ఎన్నికల్లో 1951 నుంచి ఇప్పటిదాకా 91,160 మంది పోటీ
  •     అందులో 71,246 మంది డిపాజిట్‌ గల్లంతు 
  •     అయినా ఏటా పెరుగుతున్న అభ్యర్థుల సంఖ్య 
  •     కేంద్ర ఎన్నికల కమిషన్ డేటాలో వెల్లడి 

న్యూఢిల్లీ : ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రతి అభ్యర్థి నిర్ణీత డిపాజిట్‌ చెల్లించాలి. తన నియోజకవర్గంలో  పోలైన మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో కనీసం ఆరవ వంతు ఓట్లను పొందితేనే ఆ డిపాజిట్‌ తిరిగి వస్తుంది. డిపాజిట్ తిరిగి వెనక్కి వస్తేనే ఆ అభ్యర్థికి ప్రజల్లో కాస్తో కూస్తో ఆదరణ ఉన్నట్లు. లేకుంటే ఆదరణ లేనట్లు అంచనా వేస్తం. డిపాజిట్లను కాపాడుకోవడాన్ని అభ్యర్థులు గర్వంగా ఫీల్ అవుతారు. కోల్పోవడాన్ని అవమానంగా భావిస్తారు. 

అదిగో అలాంటి ఆసక్తికరమైన అంశంపై ఎన్నికల కమిషన్ డేటా రూపొందించింది. లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా పోటీ చేసిందెంత మంది? అందులో డిపాజిట్ గల్లంతు అయినవారు ఎందరు? డిపాజిట్లను కాపాడుకోవడంలో  జాతీయపార్టీల స్థానం ఎక్కడ? అనే విషయాలను డేటాలో విశ్లేషింది. 

తొలి ఎన్నికల్లో 745 మంది డిపాజిట్లు గల్లంతు

కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం.. దేశంలో తొలి జనరల్ ఎలక్షన్స్ 1951–-52లో  జరిగాయి. ఎన్నికలలో దాదాపు 40 శాతం మంది అంటే మొత్తం 1,874 మంది అభ్యర్థుల్లో 745 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయే ట్రెండ్ క్రమంగా పెరిగింది. ఇప్పటిదాకా లోక్ సభ ఎన్నికల్లో  మొత్తం 91,160 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

 అందులో 71,246(78%) మంది అభ్యర్థులు తమ సెక్యూరిటీ డిపాజిట్‌ను కోల్పోయారు. ఇలా  అభ్యర్థులు కోల్పోయిన డిపాజిట్లను ఎన్నికల సంఘం దేశ ట్రెజరీకి మళ్లిస్తుంది.  తొలి సార్వత్రిక ఎన్నికల టైంలో సెక్యూరిటీ డిపాజిట్ కింద జనరల్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.250 ఉండేది. ప్రస్తుతం అది జనరల్ అభ్యర్థులకు రూ.25 వేలు, ఎస్సీ/ ఎస్టీలకు రూ.12,500లకు పెరిగింది.

1996లో 91 శాతం మందికి డిపాజిట్లు దక్కలే

1991-–92లో మొత్తం 8,749 మంది పోటీదారుల్లో 7,539 మంది అంటే 86 శాతం మంది అభ్యర్థులు తమ సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోయారు. 1996లో జరిగిన 11వ లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 13,952 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవగా..12,688 మంది అంటే  91 శాతం అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. ఇంతమంది డిపాజిట్ కోల్పోవడం ఇప్పటిదాకా ఇదే రికార్డ్. ఇక పార్టీ పరంగా ..2019 ఎన్నికలలో బీఎస్పీ అత్యధిక స్థానాల్లో డిపాజిట్లను కోల్పోయింది. మొత్తం 383 మంది అభ్యర్థులలో 345 మంది డిపాజిట్లు కోల్పోయారు. కాంగ్రెస్ 421 మంది అభ్యర్థులలో 148 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. 

జాతీయ పార్టీలే  బెటర్

లోక్​సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ డిపాజిట్లను బాగానే కాపాడుకుంటున్నారు. 1951–52లో జరిగిన తొలి ఎన్నికల్లో జాతీయ పార్టీలకు చెందిన 1,217 మంది అభ్యర్థుల్లో 28% అంటే 344 మంది మాత్రమే డిపాజి ట్లు కోల్పోయారు.1957లో జరిగిన తదుపరి ఎన్నికల్లో 919 మంది అభ్యర్థులలో 130 మంది అంటే కేవలం14 % అభ్యర్థులు మాత్రమే డిపాజి ట్లు కోల్పోయారు.

1977 ఎన్నికల్లో జాతీయ పార్టీలు అత్యుత్తమ పనితీరును కనబరిచాయి. మొత్తం1,060 మంది అభ్యర్థులలో కేవలం100 మంది మాత్రమే (9 శాతం) డిపాజిట్లు కోల్పోయారు. 2009 ఎన్నికలు జాతీయ పార్టీలకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చాయనే చెప్పాలి.  దాదాపు ప్రతి రెండో అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. మొత్తం 1,623 మంది అభ్యర్థుల్లో 779 మందికి డిపాజిట్లు దక్కలేదు. 

ముందే తెలిసినా..

1951 నుంచి డేటాను పరిశీలిస్తే.. డిపాజిట్లు కోల్పోతామని ముందే తెలిసినా తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు అనేక మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి  చూపిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.  రాజకీయాలపై ఉన్న అమితాసక్తే అందుకు కారణమంటున్నారు.  మరికొందరు మాత్రం అసలైన అభ్యర్థులకు కొందరిని నకలుగా (ప్రాక్సీగా) బరిలో దించుతారని పేర్కొంటున్నారు. డిపాజిట్ విలువ భారీగా పెంచినప్పటికీ అభ్యర్థుల సంఖ్య పెరుగుతూనే ఉందని అంటున్నారు.