ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ 57మంది మాజీ బ్యూరోక్రట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఢిల్లీలోని ప్రభుత్వ ఉద్యోగులను రాబోయే ఎన్నికల కోసం ఆప్ వాడుకోవాలని చూస్తోందంటూ వారు లేఖలో ఆరోపించారు. ఇటీవల పోలీస్ సిబ్బంది, హోం గార్డులు, అంగన్ వాడీ వర్కర్స్, ప్రజారవాణా వ్యవస్థలోని డ్రైవర్లను, ఆఖరికి పోలింగ్ బూత్ ఆఫీసర్లను కూడా అప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఆప్ కోసం పని చేయాలని కోరారు. ఇలా ప్రజా సేవకులను అధికార పార్టీ తమ ఎన్నికల కోసం, స్వార్థానికి వాడుకోవడం సరైంది కాదని బ్యూరోక్రట్లు విమర్శించారు.
ఇది ప్రజా ప్రతినిధుల చట్టం 1951 నిబంధనలను ఉల్లంఘించేలా ఉందని, దాంతో పాటు 1968 ఎన్నికల సింబల్స్ ఆర్డర్ లోని 16ఏ ని ఉల్లంఘిస్తోందని మాజీ బ్యూరోక్రట్లు పేర్కొన్నారు. తమ లేఖను పరిగణలోకి తీసుకొని ఆప్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తూ, స్వలాభం కోసం ఆప్ వారిని వాడుకోవాలని చూస్తోందని బ్యూరోక్రట్లు ఆరోపించారు. అంతే కాకుండా ఆప్ కోసం పని చేస్తే ట్రాన్స్ ఫర్లతో పాటు ఉచిత విద్యుత్, కొత్త స్కూల్స్, ఉచిత విద్య అంటూ పలు హామీలిచ్చి ప్రజలను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తోందని తెలిపారు.
