- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ములుగు/ హనుమకొండ/ వరంగల్/ కామేపల్లి, వెలుగు : విద్యార్థులు తమ ఆరోగ్యానికి ప్రధాన్యత ఇస్తూ విద్యలో రాణించాలని, ఉన్నత కొలువులు సాధించి తల్లిదండ్రులు, పుట్టిన ఊరికి గుర్తింపు తీసుకురావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా విజయోత్సవాలను ఆదివారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు.
ములుగు కలెక్టరేట్ లో డీఈవో సిద్ధార్థ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టెన్త్, ఇంటర్, క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మంత్రి సీతక్క ప్రశంసించి, నగదు ప్రోత్సాహకాలతోపాటు పలువురికి లాప్టాప్ లు అందజేశారు. టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 99.30శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలువడం గర్వంగా ఉందన్నారు.
వెనుకబడిన జిల్లాగా భావించే ములుగు విద్యారంగంలో అగ్రస్థానంలో నిలవడం సమిష్టి కృషి ఫలితమని, ఈ విజయానికి కారణమైన డీఈవో, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వార్డెన్లు, తల్లిదండ్రులు, విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఏటూరునాగారం పారిశుధ్య కార్మిక కుటుంబానికి చెందిన యువకుడు, మల్లంపల్లి టైర్ల కొట్టు నిర్వాహకుడి కుమార్తెలు డీఎస్పీలుగా ఉద్యోగాలు సాధించారని కొనియాడారు.
హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పాల్గొని టెన్త్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ప్రభుత్వం తరఫున ప్రతి విద్యార్థికి రూ.10 వేల నగదు బహుమతితో పాటు ఎమ్మెల్యే తన సొంత వేతనం నుంచి అదనంగా మరో రూ.10 వేల చొప్పున ప్రోత్సాహకం అందజేశారు. కనిశెట్టి మధురిమ మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ జగదీశ్వర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మెమెంటోలు, డిక్షనరీలను అందజేశారు.
వరంగల్ డీసీసీ బ్యాంక్ కాన్ఫరెన్స్హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, వరంగల్ కలెక్టర్ సత్యశారద, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి టెన్త్, ఇంటర్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన స్టూడెంట్లకు రూ.10 వేల చొప్పున చెక్కులు అందించారు. కాగా, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి ఆరుగురు విద్యార్థులకు రూ.10 వేల చొప్పున సొంతంగా బహుమతి చెక్కులు అందజేశారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొమ్మినేపల్లి జడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన ప్రోగ్రామ్లో ఎంఈవో వెంకట్ప్రతిభ చాటిన టెన్త్ స్టూడెంట్స్కు మెమోంటోలు అందజేసి, సన్మానించారు.
