నాలుగేండ్లుగా.. విత్తన సబ్సిడీ బంద్.. రాయితీ లేక అన్నదాతల అగచాట్లు

నాలుగేండ్లుగా.. విత్తన సబ్సిడీ బంద్.. రాయితీ లేక అన్నదాతల అగచాట్లు
  • అదను చూసి ధరలు పెంచేసిన కంపెనీలు
  • సన్నగింజ వరి విత్తనాల ధర క్వింటాలుకు రూ.4,650
  • దొడ్డుగింజ రకంలోనూ క్వింటాలుకు రూ.3.670
  • గతంలో క్వింటాలుకు రూ.500 నుంచి రూ.1000 రాయితీ

హైదరాబాద్‌‌, వెలుగు : వానాకాలం సీజన్‌‌లో రైతులకు సబ్సిడీ విత్తనాలు అందడం లేదు. ఈ సీజన్​కు పచ్చిరొట్ట  విత్తనాలకే రాష్ట్ర సర్కారు పరిమితమైంది. మిగిలిన విత్తనాల రాయితీ సరఫరాను ఎత్తివేయడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. విత్తన సబ్సిడీ లేక అన్నదాతలు వేలకు వేలు ఖర్చుపెట్టి బహిరంగ మార్కెట్‌‌లో విత్తనాలు కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సీజన్‌‌లో విత్తన ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. నాలుగేళ్ల క్రితం వరకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వానాకాలం సీజన్​లో రైతుల కోసం వ్యవసాయ శాఖ 7.5ల క్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీకి అందించేది.

అందులో 1.4 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలతో పాటు 2.8 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు, 2 లక్షల క్వింటాళ్ల సోయా విత్తనాలు, 0.35 లక్షల క్వింటాళ్ల పప్పుధాన్యాల విత్తనాలు, 0.13 లక్షల క్వింటాళ్ల నూనె గింజల విత్తనాలు, 0.80 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలు, వెయ్యి క్వింటాళ్ల చిరుధాన్యాల విత్తనాలను సరఫరా చేసేది. ఇప్పుడు అవేవీ రాయితీకి అందడం లేదు. 

బయటి మార్కెట్లో ఎక్కువ ధరకు కొనాల్సిన దుస్థితి

వానాకాలం సీజన్‌‌లో 45 లక్షల ఎకరాల్లో వరి సాగులోకి రానుండగా రాయితీ సరఫరాను ప్రభుత్వం ఎత్తివేసింది. గతంలో తెలంగాణ విత్తన, జాతీయ విత్తన కంపెనీ ద్వారా సబ్సిడీతో  విత్తనాలు సరఫరా చేసేవారు. గత ఐదేండ్లుగా విత్తన రాయితీని నిలిపివేశారు. ఫలితంగా మొత్తం విత్తనాలను బయటి మార్కెట్లోనే రైతులు అధిక  ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తున్నది. ఇదే అదనుగా సీడ్‌‌  కంపెనీలు ధరలను అమాంతం పెంచేశాయి. సన్నగింజ వరి విత్తనాల ధరను కొన్ని కంపెనీలు క్వింటాలుకు రూ.4,650కు పెంచగా.. దొడ్డుగింజ రకాల్లోనూ క్వింటాలుకు రూ.3,670కు పైగానే  విక్రయిస్తున్నారు. దీంతో  విత్తనపు వడ్లు కొనడం  రైతులకు భారంగా మారింది. గతంలో క్వింటాల్‌‌కు రూ.500 నుంచి రూ.1000 వరకు సబ్సిడీ లభించేది. ప్రస్తుతం ఆరు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న వేస్తున్నారు. ఈ టైంలో విత్తన సబ్సిడీ అమలు చేయకపోవడంతో రైతులు బహిరంగ మార్కెట్‌‌లో ఎక్కువ ధరకు కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. కంపెనీలను బట్టి 5 కిలోల విత్తన ప్యాకెట్‌‌కు రూ.350 నుంచి రూ.1,500 వరకు ధర ఉంది.

కొన్ని హైబ్రిడ్‌‌  రకాలు రూ.2500 వరకు అమ్ముతున్నారు. 4 లక్షల ఎకరాల్లో సోయా సాగు చేయాలని టార్గెట్‌‌  పెట్టుకోగా.. రాష్ట్రంలో 30 కిలోల బ్యాగ్‌‌  రూ.2300 నుంచి రూ.3300 వరకు అమ్ముతున్నరు. కానీ, విత్తన రాయితీ ఉన్న రాష్ట్రాల్లో సోయా 30 కిలోల బ్యాగ్  రూ.1600 నుంచి రూ.1700 వరకే లభిస్తోంది.  గతంలో రాష్ట్రంలో 2 లక్షల క్వింటాళ్ల సోయా విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం 40.65 శాతం  సబ్సిడీతో అందించింది. 75 లక్షల ఎకరాల్లో సాగుచేసే కాటన్‌‌  అన్ని విత్తన ప్యాకెట్లను రైతులే ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ప్యాకెట్‌‌ ధర రూ.853 ఉండగా కొన్ని ప్రసిద్ధి చెందిన సీడ్‌‌ కంపెనీకి చెందిన కాటన్‌‌ సీడ్లను బహిరంగ మార్కెట్లో రూ.1200 నుంచి రూ.1300 వరకు అమ్ముతున్నారు. దీంతో రైతు లపై మరింత భారం పడుతున్నది. 

సబ్సిడీ ఉంటేనే మార్కెట్‌‌లో నిలకడగా ధరలు..

ప్రభుత్వం సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేస్తే సీడ్‌‌  కంపెనీల విత్తనాల ధరలు తగ్గుతాయి. కానీ, ప్రభుత్వం రాయితీ ఎత్తేయడంతో సీడ్‌‌  కంపెనీలు ఇష్టానుసారం కూరగాయలు, మిరప, మక్కలు తదితర విత్తనాలను రెట్టింపు ధరలకు అమ్ముతున్నాయి. విత్తన రాయితీని పునరుద్ధరించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

పచ్చిరొట్ట విత్తనాలకే పరిమితం..

పచ్చిరొట్ట పంటలు జనుము, జీలుగ విత్తనాలను మాత్రమే 65 శాతం రాయితీపై ఇవ్వగా అవి కూడా అతి తక్కువగానే సరఫరా జరుగుతున్నది. ఈ విత్తనాలేవీ  చాలా మంది రైతులకు అందడం లేదు. కేటాయించిన రూ.76 కోట్లు కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. కంది, పెసర, నువ్వులు, మినుములు, సోయాబీన్‌‌ తదితర పంటల విత్తనాలకు సర్కారు సబ్సిడీ కరువైంది. పప్పుధాన్యాలు కంది, పెసర, మినుము పంటల విస్తీర్ణాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో 50 శాతం  రాయితీ అందించేది. అలాగే గతంలో అన్నిరకాల కూరగాయల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై ఇవ్వగా ప్రస్తుతం ఆ రాయితీని కూడా పూర్తిగా నిలిపివేశారు. దీంతో బొప్పాయి సీడ్‌‌  వందల నుంచి వేలు, లక్షల ధర పలుకుతున్నది.