రాజముద్ర : CAA ఫస్ట్ బ్యాచ్ సర్టిఫికెట్స్ కేటాయింపు..!

రాజముద్ర : CAA ఫస్ట్ బ్యాచ్ సర్టిఫికెట్స్ కేటాయింపు..!

దేశంలో  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు తర్వాత తొలిసారి 14 మందికి కేంద్రం భారత పౌరసత్వం ఇచ్చింది. ఢిల్లీలో వారికి సర్టిఫికెట్లను జారీ చేసింది.  ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా దిల్లీలో వారికి సీఏఏ కింద జారీ అయిన పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు.  హోం మంత్రిత్వ శాఖ 2024మార్చి 11న పౌరసత్వ (సవరణ) రూల్స్ ను నోటిఫై చేసింది.

2014 డిసెంబర్ 31కి ముందు దేశంలోకి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించడమే సీఏఏ ఉద్దేశం. 2019లోనే పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ బిల్లును ఇటీవల ఎన్నికల ముందు కేంద్రం అమల్లోకి తెచ్చింది. అయితే  సీఏఏను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. 2014 డిసెంబరు 31 కంటే ముందు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి  మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ముగుస్తుంది.

అసలు ఏమిటీ చట్టం?

ఈ పౌరసత్వ సవరణ బిల్లును మొదటిసారి 2016 జూలైలో పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు. అప్పుడు లోక్​సభలో ఆమోదం పొందింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య 2019 డిసెంబర్​ 11న ఈ బిల్లు పార్లమెంట్​లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి సమ్మతి లభించింది. పాకిస్తాన్​, అఫ్గానిస్తాన్​, బంగ్లాదేశ్​లో మతపరమైన హింస కారణంగా భారతదేశానికి  వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్​  మైనారిటీలకు భారత పౌరసత్వం ఇవ్వడం సీఏఏ లక్ష్యం. 

64 ఏండ్ల కిందటి భారత పౌరసత్వ చట్టం –1955ను ఇది సవరించింది. భారత పౌరసత్వం పొందేందుకు దేశంలో 11 ఏండ్లపాటు నివసించడంకానీ.. పనిచేసి ఉండాలనే నిబంధనలను సవరించింది.  సీఏఏ ప్రకారం పాకిస్తాన్​, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్​కు చెందిన ముస్లిమేతర శరణార్థులు పౌరసత్వం పొందాలంటే ఆరేండ్లపాటు దేశంలో నివసించడం లేదా పనిచేసి ఉండాలి. ఇందులో ముస్లింలను చేర్చకపోవడం వివాదానికి కారణమైంది.