
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరించి రాజకీయాలపైనే ఫోకస్చేసిందని మాజీ మంత్రి కేటీఆర్అన్నారు. బోనస్ తో కొంటాం అని బోగస్ మాటలు చెప్పిందని విమర్శించారు. అప్పు అనేదే తప్పు అన్నట్లు ప్రచారం చేసిన సన్నాసులు ఇప్పుడు అప్పులు ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ విషయంలో బీజేపీ ఏం చేయబోతుందో జూన్ 4 తర్వాత తెలుస్తుందన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణ ప్రభుత్వం రైతులను విస్మరించింది. కాంగ్రెస్ వచ్చాక ధాన్యం కొంటలేదు. కామారెడ్డి, నిర్మల్, భువనగిరి, రాజన్న సిరిసిల్ల జిల్లాల రైతులు రోడ్డెక్కారు. ఎన్నికలు ముగిసినై ఇప్పుడు అయిన పంటలు కొనండి. రాజకీయాలు పక్కన పెట్టి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ రైతుకు అండగా ధర్నాలు చేస్తం. క్వింటాకు రూ.500 బోనస్ఇచ్చేదాకా సర్కార్‌ను వదలం. జాబ్‌క్యాలెండర్, మెగా డీఎస్సీ దగా అయ్యింది. ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు తానే ఇచ్చినా అని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నరు’ అని ఆరోపించారు.
బ్లాక్‌మెయిలర్ గెలిస్తే మరో నయ్యిమ్
‘ఒక బ్లాక్ మెయిలర్‌ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పోటీలో పెట్టింది. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే నల్గొండలో నయ్యిమ్ తయారు అవుతాడు. మీడియాని అడ్డం పెట్టుకుని దందాలు చేసే వ్యక్తి, పార్టీలు మారే వ్యక్తికి ఓటు వేస్తే నష్టం మనకే. ఈరోజు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు కావాలి. అప్పుల విషయంలో కాంగ్రెస్నేతలవి చిల్లర రాజకీయాలు. మూడు లక్షల ఎనభై కోట్ల అప్పు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిందని రిజర్వ్ బ్యాంకు నివేదిక రిలీజ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అంటూ ఫేక్ ప్రచారం చేస్తోంది. దీనికి సీఎం, డిప్యూటీ సీఎం రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగులను ముఖ్యమంత్రే నమ్మకపోతే ఎలా? పోలింగ్ విధులుకు వెళ్లిన టీచర్లపై లాఠీచార్జి చేస్తరా.. ఎక్కడైనా? ’ అని కేటీఆర్ ప్రశ్నించారు.