బాధ్యతలు చేపట్టిన ఫెడరేషన్ చైర్మన్లు..హాజరైన మంత్రి పొన్నం 

బాధ్యతలు చేపట్టిన ఫెడరేషన్ చైర్మన్లు..హాజరైన మంత్రి పొన్నం 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఇటీవల నియమించిన వివిధ కులాల ఫెడరేషన్ చైర్మన్లు గురువారం బాధ్యతలు చేపట్టారు. మసాబ్ ట్యాంక్ సంక్షేమ భవన్​లో రజక కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్​గా దాసరి రాజు అజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు అటెండ్ అయ్యారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రజక వృత్తి ఉండాలని మొదటి దశలో 119 నియోజకవర్గాల్లో మోడర్న్ డ్రైక్లీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని మంత్రి గుర్తుచేశారు. ప్రభుత్వం రజకులకు ప్రారంభించిన 250 యూనిట్ల ఉచిత విద్యుత్​కు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగిస్తున్నామని చెప్పారు.

నియోజకవర్గానికి ఒక మోడర్న్ దోభీఘాట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మున్నూరు కాపు కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం,  వైస్ చైర్మన్​గా అల్లం భాస్కర్ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ పెరిక కుల కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్‌ బుడగం శ్రీనివాస్ హైదరాబాద్‌లోని సంక్షేమ భవన్​లోబాధ్యతలు చేపట్టారు. తెలంగాణలో మొదటిసారిగా పెరిక కుల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి పెరిక సమాజానికి అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.