బాసెల్: సొంతగడ్డపై జరిగిన బాసెల్ ఏటీపీ టోర్నీని స్విట్జర్లాండ్ లెజెండరీ ప్లేయర్, వరల్డ్ నం.3 రోజర్ ఫెడరర్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ ఫెడెక్స్ 6–1, 6–2తో అలెక్స్ మినౌర్ (ఆస్ట్రేలియా)పై సునాయాసంగా విజయం సాధించాడు. ఫెడరర్ కెరీర్‌లో ఇది 103వ టైటిల్ కాగా బాసెల్ టోర్నీని పదోసారి కైవసం చేసుకోవడం విశేషం. దీంతో ఈ సీజన్‌లో నాలుగో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజా విజయంతో తనకు 500 ఏటీపీ ర్యాంకింగ్ పాయింట్లు, 4 లక్షల 30 వేల పౌండ్ల (సుమారు రూ.4 కోట్లు ) ప్రైజ్‌మనీ దక్కుతుంది. అయితే ఈ వారంలో జరిగే పారిస్ మాస్టర్స్ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఫెడెక్స్ తెలిపాడు.

