- రెండు బోగీలు దగ్ధం
- ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ప్రాణాపాయం
- నాంపల్లి రైల్వేస్టేషన్లో ఘటన
అబిడ్స్, వెలుగు: హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ టు జైపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్(12702)లోని 3 టైర్ ఏసీ కోచ్ బి1 , బి2 బోగీల్లో మంటలు చెలరేగాయి. వివరాల్లోకి వెళ్తే.. రైలు శుక్రవారం సాయంత్రం 6.15 గంటలకు ప్లాట్ఫామ్నంబర్4 పైకి చేరుకుంది. 7.50 గంటలకు జైపూర్ కు బయలుదేరాల్సి ఉండగా.. ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన 10 నిమిషాల్లోనే బి1 బోగీలో మంటలు చెలరేగాయి. పిల్లోస్ , బెడ్ షీట్స్ , ఫ్యాబ్రిక్ మెటీరియల్ కారణంగా బి2 బోగీకి వేగంగా వ్యాపించాయి.
దీంతో సిబ్బంది ఆ రెండు బోగీలను ట్రైన్ నుంచి వేరు చేశారు. అనంతరం ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా.. సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో వచ్చి, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో బోగీల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనతో రైల్వేస్టేషన్లో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు ఎగిసి పడటంతో ప్లాట్‌ఫామ్‌నుంచి పరుగులు తీశారు.
ఈ ప్రమాదం పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపడంతో తమ లగేజ్‌తో పడిగాపులు కాశారు. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీ వాత్సవ్ సంఘటన స్థలానికి చేరుకొని కాలిపోయిన బోగీలను పరిశీలించారు. బి1 బోగీ పూర్తిగా దగ్ధమైందని, బి2 బోగీ పాక్షికంగా కాలిపోయిందని తెలిపారు. సంఘటన సమయంలో బోగీల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందన్నారు. కొన్ని గంటల్లోనే అదనపు బోగీలు అమర్చి, రైలు సర్వీస్‌ను పునరుద్ధరిస్తామని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. నాంపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
