భోలక్ పూర్ లో పటాకుల నిప్పురవ్వలు పడి కట్టెల మండిలో భారీ అగ్ని ప్రమాదం

భోలక్ పూర్ లో పటాకుల నిప్పురవ్వలు పడి కట్టెల మండిలో భారీ అగ్ని ప్రమాదం
  •     రూ.20 లక్షల ఆస్తి నష్టం
  •     ముషీరాబాద్​లో భోలక్​పూర్​లో ఘటన

ముషీరాబాద్, వెలుగు: ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్​పూర్​లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరా నగర్ సమీపంలోని సహారా ఫంక్షన్ హాల్ వెనుక నిజాముద్దీన్ అనే వ్యక్తి కట్టెల మండి నిర్వహిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి సదరు ఫంక్షన్ హాల్​లో జరిగిన ఒక శుభకార్యం ముగిసిన తర్వాత, ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కొందరు పటాకులు పేల్చారు. ఆ పటాకుల నిప్పు రవ్వలు ఎగిరి పక్కనే ఉన్న కట్టెల మండిపై పడటంతో మంటలు చెలరేగి భారీగా ఎగసిపడ్డాయి. 

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ముషీరాబాద్ పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 6 ఫైర్ ఇంజిన్ల సహాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు నిజాముద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు కాలేదని, దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని పోలీసులు తెలిపారు.