స్వీడిష్ అకాడమీ 2018, 2019 సంవత్సరాలకు సాహిత్యంలో నోబెల్ ప్రైజ్‌లు గురువారం ప్రకటించింది. 2019 ఏడాదికి ఆస్ట్రియా రచయిత పీటర్ హండ్కేను, 2018కిగాను పోలండ్ రచయిత్రి ఓల్గా తొకర్జుక్ను ఎంపిక చేసినట్లు అకాడమీ వెల్లడించింది. ప్రైజ్ కింద ఈ ఇద్దరు రైటర్లకు చెరో 6.5కోట్ల రూపాయలు, మెడల్ అందజేస్తారు. డిసెంబరు 10న స్వీడన్‌లో అవార్డుల ప్రదానం జరుగుతుంది. మీటూ ఉద్యమ నేపథ్యంలో కిందటేడాది పురస్కారాల ప్రకటన వాయిదాపడ్డ సంగతి తెలిసిందే.
పోలండ్ రైటర్‌కు ఫస్ట్ టైమ్
57ఏండ్ల ఓల్గా తొకర్‌జుక్ సాహిత్యంలో నోబెల్ గెల్చుకున్న మొట్టమొదటి పోలండ్రైటర్గా నిలిచారు. నావలిస్ట్, యాక్టివిస్ట్, మేధావిగా గొప్ప పేరుతెచ్చుకున్న ఆమె, 2007లో పోలిష్ భాషలో ‘బెగూనీ’ పేరుతో రాసిన నవల.. 2017లో ‘ఫ్లైట్స్’ పేరుతో ఇంగ్లీష్‌లోకి అనువాదమైంది. లైఫ్ జర్నీలో చెడును నివారించాలనే ఫిలాసఫీతో సాగే ఈ నవల(ఫ్లైట్స్)కే ఇప్పుడు నోబెల్ దక్కింది. ఓల్గా తన నవలల్లో ఒక అద్భుతమైన ఊహా ప్రపంచాన్ని, దేశాల మధ్య బోర్డర్లకు అతీతంగా సాగే మనుషుల జీవనసరళిని చూపిస్తారని, సబ్జెక్ట్ నాలెలెడ్జ్ని పాఠకుడితో పంచుకోవాలనే తపన కనిపిస్తుందని స్వీడిష్ అకాడమీ మెచ్చుకుంది. ఇదే ‘ఫ్లైట్స్’ నవలకు కిందటేడాది ‘మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్’ కూడా లభించింది.
నోబెల్‌ను తిట్టిన రెబల్కే పట్టం
ఆలోచనలు రేకెత్తించే నవలలు, నాటకాలు రాయడంలో ఆస్ట్రియా రచయిత పీటర్ హండ్కే(76) దిట్ట. అందుకే 2019 నోబెల్ ప్రైజ్ ఆయనను వరించింది. వివాదాస్పద రైటర్‌గానూ పేరుపొందిన పీటర్ ఐదేండ్ల కిందట ఓ సందర్భంలో.. సాహిత్యంలో ఇస్తున్న నోబెల్ ప్రైజ్‌ను రద్దు చేయాలని, దానివల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదని తిట్టిపోశారు. అయితే లిటరేచర్‌లో విశేష కృషికిగానూ ఆయనకే నోబెల్ ఇస్తున్నట్లు స్వీడిష్ అకాడమీ ఇవాళ ప్రకటించింది. హ్యూమన్ ఎమోషన్స్‌ను పీటర్ తనదైన శైలిలో ఎఫెక్టివ్‌గా రాశారని అకాడమీ కొనియాడింది. తన తల్లి ఆత్మహత్యపై పీటర్ 1975లో రాసిన ‘ఎ సారో బియాండ్ డ్రీమ్స్’ అనే రచన ప్రపంచ వ్యాప్తంగా పాపులరైంది.

