జూన్ 8న చేప ప్రసాదం ..నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లపై మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్ సమీక్ష

జూన్ 8న చేప ప్రసాదం ..నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లపై మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్ సమీక్ష

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌‌‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. సుమారు 60 వేల మంది చేప ప్రసాదం తీసుకునే అవకాశం ఉంది. దేశంలోని పలు రాష్ట్రాలు, విదేశాల నుంచి వేల మంది ఆస్తమా బాధితులు రానున్న దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో చేప ప్రసాదం పంపిణీ చేస్తుండడంతో ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో  మంత్రులు వాకిటి  శ్రీహరి, అజారుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కలెక్టర్ ప్రియాంక అల,  ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్, వివిధ శాఖల ఆఫీసర్లు, బత్తిని కుటుంబ సభ్యులతో జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి పొన్నం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జూన్ 8న మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో 60 వేల మంది చేప ప్రసాదం తీసుకునే అవకాశం ఉందన్నారు.

తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలు, విదేశాల నుంచి లక్షలాది మంది ఆస్తమా బాధితులు రానున్న దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అంబులెన్సులు, అవసరమైన మందులు, సీపీఆర్ శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, వలంటీర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మంత్రి వాకిటి మాట్లాడుతూ.. 1847లో బత్తిని వీరన్న గౌడ్ ప్రారంభించిన ఈ చేప ప్రసాదం 179 ఏండ్లుగా కొనసాగుతుండడం విశేషమన్నారు. భారీ సంఖ్యలో వచ్చే ప్రజలను దృష్టిలో పెట్టుకొని అదనపు నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. 

చేప ప్రసాదాన్ని ఇంటికి డెలివరీ చేయరు

చేప ప్రసాదాన్ని ఇంటికి డెలివరీ చేయమని బత్తిని గౌరీ శంకర్ గౌడ్ తెలిపారు. క్యూ లైన్లలో నిలబడిన వారిని మాటల్లో పెట్టి, చేప ప్రసాదాన్ని ఇంటికి డెలివరీ చేస్తామని నమ్మిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారి మాటలు నమ్మొద్దని సూచించారు. 8న రాత్రి ప్రారంభమై 9న రాత్రి వరకు పంపిణీ కొనసాగుతుందని, ప్రసాదం లభించని వారికి గౌలిదొడ్డిలోని తమ ఇంటి వద్ద 
ఇస్తామని చెప్పారు.