తెలంగాణలో వడదెబ్బతో ఐదుగురు మృతి

తెలంగాణలో  వడదెబ్బతో ఐదుగురు మృతి
  • వరంగల్, ములుగు, సిరిసిల్ల,
  •  వికారాబాద్, హైదరాబాద్​ జిల్లాల్లో విషాదం
  •     తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రులకు తరలించేలోపే మృత్యువాత
  •     ‘ఆ కుర్చీని మడత పెట్టి’ అనే మాస్ డైలాగ్‌‌ తాత మహ్మద్ పాషా మృతి

నెక్కొండ/ములుగు/కోనరావుపేట/తాండూరు/ సనత్​నగర్, వెలుగు: రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో బుధవారం వడదెబ్బతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్‌‌ జిల్లా నెక్కొం డ మండలంలోని అలంకానిపేటకు చెందిన సౌరపు సారమ్మ (55) పనుల కోసం వ్యవసా య బావి వద్దకు వెళ్లి  తిరిగి ఇంటికి వచ్చి అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు హాస్పిటల్‌‌కు తరలిస్తుండగా మృతి చెందింది. ములుగు మున్సిపాలిటీ పరిధిలోని ప్రేమ్‌‌నగర్‌‌కు చెందిన బోడ సాంబయ్య (45) పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తూ  అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తోటి కార్మికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్లకు చెందిన కోరేపు లచ్చిరెడ్డి, లచ్చవ్వ (55) దంపతులు కొనుగోలు కేంద్రంలో వడ్లు అమ్మి ఇంటికి వచ్చిన తర్వాత లచ్చవ్వ కుప్పకూలింది. హాస్పిటల్‌‌కు తరలించేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. వికారాబాద్‌‌ జిల్లా తాండూరు మం డలం అంతారం గ్రామానికి చెందిన తుమ్మనపల్లి సామేల్‌‌ (35)  ఇంటి నిర్మాణ పనులు చేస్తూ  కండ్లు తిరిగి పడిపోగా, తోటి కార్మికులు తాండూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.  


సోషల్ మీడియా సెన్సేషన్ 'కుర్చీ తాత' మృతి

'ఆ కుర్చీ మడతపెట్టి' అనే ఒకే ఒక్క డైలాగ్‌‌తో సోషల్ మీడియాలో స్టార్‌‌గా మారిన 'కుర్చీ తాత' అలియాస్ మహ్మద్ పాషా (66) బుధవారం సాయంత్రం మృతి చెందారు. హైదరాబాద్​లోని కృష్ణకాంత్ పార్కు వద్ద ఎండ దెబ్బకు సొమ్మసిల్లి పడిపోయారు. స్థానికులు ఆయనను ఇంటికి తీసుకెళ్లగా, ఆయన భార్య ఒడిలోనే కన్నుమూశారు. కృష్ణానగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ పాషా గతంలో ఓ యూట్యూబ్ చానల్‌‌కు ఇంటర్వ్యూ ఇస్తూ, సరదాగా ‘ఆ కుర్చీని మడతపెట్టి’ అంటూ మాస్ డైలాగ్ చెప్పగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ క్రేజ్‌‌తోనే ఆయనను నెటిజన్లు అంతా 'కుర్చీ తాత'గా పిలుచుకోవడం ప్రారంభించారు. మహేశ్​బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌‌లో వచ్చిన 'గుంటూరు కారం' సినిమాలో ‘ఆ కుర్చీని మడత పెట్టి’ అంటూ ఏకంగా ఒక స్పెషల్ సాంగ్‌‌ను కంపోజ్ చేశారు. ఈ పాట విడుదలయ్యాక పాషా మరింత పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలు, టీవీ షోలతో బిజీగా మారారు. పాషా మృతి అభిమానులు, సోషల్ మీడియా వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.