సంక్రాంతికి పతంగులను ఎందుకు ఎగరేస్తారు..?

సంక్రాంతికి పతంగులను ఎందుకు ఎగరేస్తారు..?

సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చేది రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, పిండి వంటలు. కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేసి వాటి చుట్టూ ఆడటం ఒక సంప్రదాయం. ఇక సంక్రాంతి అంటే ఇవే కాదు..గాలిపటాలు ఎగరవేయడం ఆనవాయితీ. చిన్నా పెద్దా తేడా లేకుండా కైట్స్ ను ఎగురవేస్తారు. 

హైదరాబాద్ తో పాటు గుజరాత్, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల్లో సంక్రాంతికి  ప్రజలంతా గాలి పటాలను ఎగురవేస్తారు. కొన్ని రాష్ట్రాల్లో పతంగుల పోటీలు నిర్వహిస్తారు. అయితే  గాలిపటాలు ఎగరవేయడం వెనుక కొన్ని నమ్మకాలు, మరికొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. పురాణాల ప్రకారం రాముడు మకర సంక్రాంతి రోజున  గాలి పటాన్ని ఎగురవేశాడట. రాముడు ఎగరేసిన గాలిపటం కాస్త ఇంద్రలోకానికి చేరిందట. ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది సంక్రాంతికి పతంగులు ఎగురవేయడం అనవాయితీ అయింది. 

సంక్రాంతికి పతంగులు ఎగురవేయడం వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. సంక్రాంతికి విపరీతమైన చలి  ఉంటుంది. ఈ సమయంలో పొద్దున్నే పతంగులు ఎగురవేస్తే సూర్య కిరణాలు శరీరాన్ని తాకుతాయి. వీటి వల్ల వ్యాధులు దరి చేరవు. చలి కాలంలో జలుబు, దగ్గు వంటివి వస్తుంటాయి. కాబట్టి  సంక్రాంతి వేళ పొద్దున, సాయంత్రం గాలిపటాలను ఎగురవేసేటప్పుడు సూర్య కిరణాలు శరీరానికి మంచి ఔషధంగా పని చేస్తాయి.