గత నెల 15న భూమి విషయంలో అన్నదమ్ముల కుటుంబాల మధ్య గొడవ
మహిళకు తీవ్రగాయం, దవడ భాగంలో కనిపించిన మెటల్ ఆబ్జెక్ట్
జగిత్యాల/కోరుట్ల, వెలుగు : జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో నెల రోజుల కింద ఆస్తి వివాదం నేపథ్యంలో అన్నదమ్ములు గోనె తిరుపతి, శంకర్ కుటుంబాల మధ్య జరిగిన దాడి కేసు మరో మలుపు తిరిగింది. గత నెల 15న శంకర్, అతడి భార్య అనూష, బంధువు గోపు ముత్తయ్య కలిసి తిరుపతి, అతడి భార్య లక్ష్మిపై దాడి చేశారు. లక్ష్మీ తీవ్రంగా గాయపడడంతో హాస్పిటల్ కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు లక్ష్మి దవడలో మెటల్ ఆబ్జెక్ట్ ఉన్నట్లు గుర్తించారు. దానిని వెలికితీసి ఫోరెన్సిక్ టెస్ట్ కు పంపించారు. లక్ష్మి దవడ భాగంలోంచి వెలికి తీసిన మెటల్.. బుల్లెట్టేనని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించినట్లు సమాచారం.
ఈ కేసులో ఇప్పటికే శంకర్, అనూష, ముత్తయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు, తాజాగా కాల్పుల కోణంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. శంకర్ వద్ద హార్వెస్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సచిన్ ఈ ఘటనలో కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది.
అతడు యూపీ నుంచి వచ్చినప్పుడు తన వెంట రివాల్వర్ కూడా తీసుకొచ్చినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఆస్తి వివాదం నేపథ్యంలో జరిగిన దాడి సమయంలో సచిన్ కూడా అక్కడే ఉండి లక్ష్మిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానించారు. దాడి అనంతరం సచిన్ ఉత్తరప్రదేశ్‌కు పారిపోయినట్లు గుర్తించి.. పోలీసులు మూడు రోజుల కింద ప్రయాగ్‌రాజ్ వెళ్లి సచిన్‌ను అదుపులోకి తీసుకుని మెట్‌పల్లికి తీసుకొచ్చినట్లు తెలిసింది. అతడి నుంచి రివాల్వర్ ను సైతం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
