హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ చంద్రయ్య మృతి.. మహాప్రస్థానంలో అంత్యక్రియలు

హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ చంద్రయ్య మృతి.. మహాప్రస్థానంలో అంత్యక్రియలు
  • తెలంగాణ మానవ హక్కుల  కమిషన్ తొలి చైర్మన్​గా సేవలు 
  • సీఎం సహా పలువురి సంతాపం

ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయ మూర్తిగా సేవలందించిన జస్టిస్‌‌ గుండ చంద్రయ్య(72) శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆదిలాబాద్‌‌ జిల్లా తిమ్మాపూర్‌‌ ఆయన స్వగ్రామం. 1980లో హైదరాబాద్​లో హైకోర్టు న్యాయవాదిగా ఎన్‌‌రోల్‌‌ అయ్యారు. 2005లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2016లో పదవీ విరమణ చేశారు. 

హైదరాబాద్/జన్నారం, వెలుగు:ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్‌‌ గుండ చంద్రయ్య(72) శనివారం మధ్యాహ్నం మృతిచెందారు. ఆదిలాబాద్‌‌ జిల్లా జన్నారం మండల తిమ్మాపూర్‌‌ ఆయన స్వగ్రామం. నిరుపేద కుటుంబానికి చెందిన చంద్రయ్య తిమ్మాపూర్ పక్కన ఉన్న తపాలపూర్ లో హైస్కూల్ వరకు, ఇంటర్, డిగ్రీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌‌ఎల్‌‌ఎం చేశారు.

 1980లో హైదరాబాద్​లో హైకోర్టు న్యాయవాదిగా ఎన్‌‌రోల్‌‌ అయ్యారు. 1991 నుంచి 95 వరకు ఒకసారి, 1999 నుంచి 2002 వరకు మరోసారి హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. 2005లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు. 2016లో పదవీవిరమణ చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌‌కు తొలి చైర్మన్‌‌గా ఐదేండ్లు పనిచేశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన శనివారం జూబ్లీహిల్స్‌‌ లోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌‌ మహాప్రస్థానంలో జరగనున్నాయి.

 ఎంత బిజీగా ఉన్నా జస్టిస్ చంద్రయ్య ఏడాదికి ఒకసారైన స్వగ్రామమైన తిమ్మాపూర్ ను సందర్శించి గ్రామ ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని సమస్యలను పరిష్కరించే వారు. తిమ్మాపూర్ కు తారు రోడ్డు వేయించడానికి ఎంతో కృషి చేశారు. గ్రామంలో తన స్వంత ఖర్చులతో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ ను అభివృద్ధి చేశారు. చంద్రయ్య సతీమణి స్వరూప 2012లో మరణించారు. ఆయనకు కూతురు లావణ్య, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు.


రెండు అవార్డులు న్యాయవాది వృత్తితో పాటు న్యాయమూర్తిగా, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా పేదల పక్షాన నిలిచిన చంద్రయ్యకు నెల్సన్ మండేల అవార్డుతో పాటు పదవి విరమణ తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్ నుంచి మరో అవార్డు వచ్చింది. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.

  • సీఎం రేవంత్ రెడ్డి సంతాపం 

జస్టిస్ చంద్రయ్య మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వివిధ శాఖలకు స్టాండింగ్ కౌన్సిల్‌‌గా, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యుడిగా, ప్రభుత్వ న్యాయవాదిగా న్యాయ రంగంలో విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. జస్టిస్ చంద్రయ్య సామాజిక అసమానతలు, మానవ హక్కుల ఉల్లంఘనల వంటి అంశాలపై అనేక చారిత్రాక తీర్పులు వెలువరించినట్లు ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. 

అలాగే జస్టిస్​చంద్రయ్య మృతి పట్ల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్, దళిత బహుజన సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశాయి. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. జస్టిస్ చంద్రయ్య  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ గౌరవ సభ్యుడుగా  కొనసాగారు.