- మాజీ సర్పంచులపై సర్కార్ కక్ష గట్టింది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు
- సీఎంకు వినతిపత్రం ఇవ్వడానికి వస్తే అరెస్టు చేస్తరా?
- పనులు చేసిన పాపానికి వాళ్లను శిక్షిస్తున్నరు
- వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్
- మాజీ సర్పంచ్‌లకు మద్దతుగా తిరుమలగిరి పీఎస్ ముందు బైఠాయింపు
హైదరాబాద్/ కంటోన్మెంట్, వెలుగు: అప్పులు చేసి.. భార్య, పిల్లల బంగారం అమ్మి గ్రామాల్లో మాజీ సర్పంచ్‌లు అభివృద్ధి పనులు చేస్తే వాళ్లకు సర్కారు బిల్లులు చెల్లించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తున్నదని దుయ్యబట్టారు. పెండింగ్ బిల్లుల కోసం సీఎంకు వినతిపత్రం ఇవ్వడానికి మాజీ సర్పంచ్‌లు బయలుదేరితే వాళ్లను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులు చలో హైదరాబాద్ కు పిలుపునిస్తే, ఎక్కడిక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం దుర్మార్గం. వారిని దొంగలను, టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు అరెస్ట్‌చేశారు. మాజీ సర్పంచుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పెండింగ్ బిల్లుల కోసం ఆందోళనకు దిగిన మాజీ సర్పంచులను పోలీసులు అరెస్ట్‌చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇందుకు నిరసనగా బీఆర్ఎస్లీడర్లు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, మదుసూధనాచారి తదితరులు సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీసుస్టేషన్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని వారిని స్టేషన్ఆవరణలోకి తీసుకెళ్లారు. అక్కడే బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. భార్యల మెడల్లోని పుస్తెలను కూడా అమ్మి మాజీ సర్పంచ్‌లు (సర్పంచ్‌లుగా ఉన్నటైమ్‌లో) గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశారని, వారికి ప్రభుత్వం బిల్లులను పెండింగ్‌లో పెట్టడమేమిటని ప్రశ్నించారు.
పనులు చేసిన పాపానికి ఇదేం శిక్ష
మాజీ సర్పంచ్‌లను బాధలు వినాలని వస్తే తమను పోలీసులు వాహనాల్లో ఎక్కించి తరలించడం ఏమిటని హరీశ్ మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి సర్పంచులు ఎంతో కృషి చేశారు. ఉత్తమ గ్రామాల్లో తెలంగాణ మెదటి స్థానం ఉండడం వెనుక, ప్రధాని అవార్డులు, పంచాయతీ అవార్డులు సాధించడం వెనుక సర్పంచుల పాత్ర కీలకం. మంచి పనులు చేసిన సర్పంచులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు శిక్ష వేస్తున్నారు? ప్రభుత్వం వచ్చి10 నెలలు దాటినా రూ. పది లక్షల బిల్లులు కూడా చెల్లించలేదు. మాజీ సర్పంచ్‌లు నాలుగైదు సార్లు హైదరాబాద్ కు వచ్చి మొర పెట్టుకున్నా సీఎం, పంచాయతీ శాఖ మంత్రి చర్చలకు పిలవకపోవడం సిగ్గుచేటు. బడా కాంట్రాక్టర్లకు రూ. వందల కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారు కానీ, మాజీ సర్పంచులు పనులు చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్నా” అని ప్రశ్నించారు. ‘‘రూ. లక్షా 50వేల కోట్లతో మూసీ బాగు చేస్తానంటున్నారు. కానీ, గ్రామాలను ఎంతో అభివృద్ధి చేసిన మాజీ సర్పంచులకు ఎందుకు శిక్ష వేస్తున్నరు. వెంటనే వారి పెండింగ్ బిల్లులు చెల్లించాలి. అరెస్టు చేసిన వారిని వదిలిపెట్టాలి’’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఫ్రీ కరెంట్‌ను మీ ఘనతగా చెప్పుకునుడేంది?
‘‘దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటును అందించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్. కానీ, ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకొని ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటున్నది” అని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ‘‘రైతులకు 24 గంటల ఉచిత కరెంటు దండగ అని, మూడు గంటల కరెంటు సరిపోతుందని గతంలో రైతు వ్యతిరేక వైఖరిని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పుడేమో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఓట్ల కోసం 24 గంటల ఉచిత కరెంటు ఘనతను తమ ఖాతాలో వేసుకుంటూ దేశ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు” అని ఆయన సోమవారం ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పాలన గురించి చూపించుకునే ముఖం లేక, తెలంగాణలో బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
