తమిళనాడు ఎన్నికల ఫలితాలు కేవలం పోలింగ్ కేంద్రాలకే పరిమితం కాలేదు. ఆ హీట్ స్టాక్ మార్కెట్‌లోనూ ప్రకంపనలు సృష్టించింది. నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ తాజా ఎన్నికల్లో సృష్టిస్తున్న అద్భుత ప్రభంజనం దెబ్బకు.. అధికార డీఎంకేకి అత్యంత సన్నిహితంగా ఉండే సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు కుప్పకూలాయి. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో సన్ టీవీ షేరు ఏకంగా 8 శాతం పతనమై ఒక్కోటి రూ.557 వద్దకు చేరింది. 2024 ఆగస్టు తర్వాత ఈ స్టాక్‌కు ఇదే అతిపెద్ద సింగిల్ డే ఫాల్ కావడం గమనార్హం.
విజయ్ వేవ్.. క్లీన్ స్వీప్ దిశగా టీవీకే
తమిళనాడులో ఈసారి "1967, 1977" నాటి హిస్టరీ రిపీట్ అవుతుందని విజయ్ తన ప్రచారంలో చెప్పిన మాటలు నిజమవుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తం 234 స్థానాల్లో టీవీకే ఏకంగా 98 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. అన్నాడీఎంకే 74, డీఎంకే కేవలం 61 స్థానాలకు పరిమితం అయ్యాయి. ముఖ్యంగా డీఎంకే కంచుకోటలుగా భావించే చెన్నై పరిసర ప్రాంతాల్లో విజయ్ పార్టీ జెండా ఎగురవేస్తుండటంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తుతున్నారు.
స్టాలిన్ ఫ్యామిలీకే షాక్..
సన్ టీవీ అధినేత కళానిధి మారన్, డీఎంకే అధినేత స్టాలిన్ కుటుంబాల మధ్య ఉన్న విడదీయరాని అనుబంధం అందరికీ తెలిసిందే. డీఎంకే అధికారంలో ఉంటే సన్ టీవీకి ఎదురుండదనేది మార్కెట్ నమ్మకం. కానీ ఇప్పుడు సాక్షాత్తు సీఎం ఎం.కె. స్టాలిన్ కొలత్తూరులో, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేపాక్‌లో వెనుకంజలో ఉండటం సన్ టీవీ ఇన్వెస్టర్లను ఆందోళనలో పడేసింది. 15 మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారనే వార్తలతో ఈ మిడ్-క్యాప్ స్టాక్ టాప్ లూజర్‌గా నిలిచింది సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో.
చరిత్ర తిరగరాస్తున్న దళపతి..
ఒకప్పుడు అన్నాదురై కాంగ్రెస్‌ను, ఎంజీఆర్ డీఎంకేను ఓడించి చరిత్ర సృష్టించినట్లుగా.. ఇప్పుడు విజయ్ 'ద్రవిడ మోడల్'ను మట్టికరిపిస్తూ కొత్త శకానికి నాంది పలుకుతున్నారు. తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్న విజయ్ భారీ మెజారిటీతో దూసుకుపోతున్నారు. డీఎంకే ఓటమి ఖాయమనే సంకేతాలు వెలువడటంతో.. ఆ పార్టీకి ఆర్థికంగా, రాజకీయంగా అండగా ఉండే సంస్థల షేర్లు పతనం అవుతున్నాయి. ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడే సరికి సన్ టీవీ షేర్ మరింత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారు. చూడాలి సన్ టీవీ స్టాక్స్ రానున్న కాలంలో ఎలా ఉంటాయో.
