తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ TVK పార్టీ 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటూ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118కి మరో 8 సీట్ల దూరంలో నిలిచింది. ఈ క్రమంలో విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలంటే ఆయన ముందున్న రాజకీయ సమీకరణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. చిన్న పార్టీల సపోర్ట్:
విజయ్ ముందున్న అత్యంత ఈజీ ఆప్షన్ చిన్న పార్టీలను కలుపుకుపోవడమే. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం.. డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ 3, సీపీఐ 2, వీసీకే 2 స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ వీరు విజయ్‌కు మద్దతు ప్రకటిస్తే.. టీవీకే సునాయాసంగా 118 మార్కును దాటుతుంది. వీటితో పాటు 7 స్థానాలు గెలుచుకున్న PMK కూడా 'కింగ్ మేకర్' పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది తమిళనాడులో. ఈ పార్టీల మద్దతు తీసుకుంటే.. పెద్ద పార్టీలకు లొంగిపోకుండా విజయ్ తన స్వతంత్రతను కాపాడుకోవచ్చు.
2. ఏఐఏడీఎంకేతో పొత్తు:
మరో ఆప్షన్ ఏఐఏడీఎంకేతో చేతులు కలపడం. ఎన్నికలకు ముందు పొత్తు చర్చలు విఫలమైనప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారానికి దూరమవ్వకూడదనే ఉద్దేశంతో పళనిస్వామి విజయ్‌కు సపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే బీజేపీతో ఏఐఏడీఎంకేకు ఉన్న సాన్నిహిత్యం ఇక్కడ పెద్ద అడ్డంకి. ఒకవేళ ఏఐఏడీఎంకేతో కలవాలంటే.. వారు బీజేపీతో సంబంధాలను తెంచుకోవాలని విజయ్ షరతు పెట్టే అవకాశం కూడా ఉంది. అనుభవం ఉన్న ఏఐఏడీఎంకే తోడైతే పాలన పరంగా విజయ్‌కు కలిసొస్తుంది కూడా.
3. కాంగ్రెస్ రాయబారం:
ప్రచార సమయంలో విజయ్ డీఎంకేను 'నెంబర్ 1 శత్రువు'గా ప్రకటించారు. కుటుంబ పాలన, అవినీతిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినందున, డీఎంకేతో నేరుగా కలవడం అసాధ్యం. అయితే డీఎంకే తన కూటమిలోని కాంగ్రెస్ పార్టీ ద్వారా రాయబారాలు నడిపే అవకాశం ఉంది. ఒకవేళ డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితిలో ఉంటే.. కనీసం బీజేపీని అడ్డుకోవడానికైనా కాంగ్రెస్ తన సపోర్ట్ విజయ్‌కు అందించవచ్చు.
మెుత్తానికి తమిళనాడు ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోతే విజయ్ తన సిద్ధాంతాలకు కట్టుబడి విపక్షంలో కూర్చుంటారా? లేక చిన్న పార్టీలకు మంత్రి పదవులు ఇచ్చి అధికారాన్ని దక్కించుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏ పార్టీ సపోర్ట్ తీసుకున్నా.. వారికి కేబినెట్‌లో కీలక శాఖలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది విజయ్ హామీ ఇచ్చిన సత్వర మార్పుకు ఆటంకం కలిగించవచ్చు. అయితే ఆయన పొలిటికల్ వ్యూహకర్తలు ఈ సమస్యలను విజయ్ చేత ఎలా హ్యాండిల్ చేయిస్తారో వేచి చూడాల్సిందే. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడూ ఎక్కడా లైఫ్ లాంగ్ శత్రువులు ఉండరు. రాజకీయాల్లో అన్నీ సరైనవే అనే సిద్ధాంతాన్ని టీవీకే ఎలా తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే.
మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో ద్రావిడ దిగ్గజాలకు దీటుగా నిలిచిన విజయ్.. ఇప్పుడు చాణక్య వ్యూహాలతో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారనేది దేశంలోని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం. ఆధిక్యం ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మిత్రపక్షాల సపోర్ట్ ఇప్పుడు విజయ్‌కు అనివార్యంగా మారిపోయింది.
