తమిళనాడు రాజకీయాల్లో 60 ఏళ్ల ద్రావిడ పాలనను సవాల్ చేస్తూ.. విజయ్ స్థాపించిన TVK పార్టీ ఎన్నికల్లో సృష్టించిన సంచలనం భారత రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం లిఖించింది. ఎన్టీఆర్ తరహాలో రాజకీయాల్లోకి వచ్చిన ఏడాదిలోనే సీఎం కుర్చీ దిశగా దూసుకెళ్తున్న విజయ్ విజయం వెనుక ఉన్న 16 ప్రధాన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. విన్నర్ వైబ్: విజయ్ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. లక్షలాది మంది ప్రజలు ఆయనను కేవలం నటుడిగా కాకుండా ఒక విజేతగా చూసి నీరాజనాలు పట్టారు.
2. జెన్-జెడ్ పవర్: తమిళనాడులో సగటు వయస్సు 37 ఏళ్లు. అవినీతిమయమైన పాత వ్యవస్థపై విసిగిపోయిన యువత, తమ గొంతుకగా విజయ్‌ను ఈసారి ఎన్నుకున్నారు.
3. మహిళా ఓటర్ల అండ: రాష్ట్రంలో మహిళల భద్రతపై నెలకొన్న ఆందోళనలు డీఎంకేకు వ్యతిరేకంగా మారాయి. విజయ్ క్లీన్ ఇమేజ్ మహిళా ఓటర్లను బాగా ఆకర్షించింది.
4. కులాతీత రాజకీయాలు: తమిళ రాజకీయాలను శాసించే కుల సమీకరణాలకు విజయ్ దూరంగా ఉన్నారు. అందరినీ కలుపుకుపోయే లౌకిక విధానం ఎన్నికల్లో కలిసివచ్చింది.
5. ద్రావిడ రాజకీయాలకు స్వస్తి: ఇది కేవలం ప్రభుత్వంపై వ్యతిరేకత మాత్రమే కాదు. దశాబ్దాల ద్రావిడ రాజకీయాలపై ప్రజల్లో వచ్చిన అసహనం.
6. అవినీతిపై పోరు: అధికార పార్టీపై ఉన్న తీవ్రమైన అవినీతి ఆరోపణలను విజయ్ నేరుగా ఎండగట్టారు. 'తీయా శక్తి' అన్న ఆయన నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లింది.
7. ప్రతిపక్షాల విమర్శలే వరమయ్యాయి: విజయ్ సపోర్టర్స్ అజ్ఞానులు అంటూ ప్రతిపక్షాలు విమర్శించడం ప్రజలకు కోపం తెప్పించింది. ఇది విజయ్‌కు సానుభూతిగా మారింది.
8. ప్రత్యామ్నాయం లేకపోవడం: అన్నామలై, సీమన్ వంటి నేతలు ప్రయత్నించినా.. డీఎంకే, ఏఐఏడీఎంకేలకు అసలైన ప్రత్యామ్నాయంగా విజయ్ మాత్రమే నిలిచారు.
9. అజెండా సెట్టర్: ఇతరుల విమర్శలకు స్పందించడం కంటే, తానే సొంతంగా రాజకీయ చర్చను ప్రారంభించి ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేశారు.
10. నిజాయితీ హుందాతనం: ఫేక్ ప్రామిస్‌లు కాకుండా.. సూటిగా మాట్లాడే విజయ్ తీరు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించింది. ఓట్ల కోసం ఇచ్చే డబ్బును విజయ్ వ్యతిరేకించారు.
11. నటులకు పట్టాభిషేకం: ఎంజీఆర్, జయలలిత కాలం నుంచి తమిళనాడుకు సినిమా హీరోలపై ఉన్న పిచ్చి ప్రేమ విజయ్ ఓట్లుగా మార్చుకోగలిగారు.
12. టెక్నాలజీ వాడకం: పాతతరం విశ్లేషకులు గ్రహించలేనంత వేగంగా సోషల్ మీడియా, యాప్స్ ద్వారా విజయ్ ప్రజలకు చేరువయ్యారు.
13. సరైన టైమింగ్: ఎన్నికల ముందు తన గ్రాఫ్‌ను పీక్ స్టేజ్‌కు తీసుకెళ్లారు. అడ్డంకులు ఎదురైనా తన వేగాన్ని తగ్గించలేదు.
14. కౌంటర్ అటాక్: డీఎంకే సోషల్ మీడియా విమర్శలను విజయ్ సపోర్టర్స్ ఎన్నికల వేళ సమర్థవంతంగా తిప్పికొట్టారు.
15. మార్పు కోసం తపన: సమాచార విప్లవం వల్ల ప్రజల్లో వచ్చిన చైతన్యం, భారీ మార్పును కోరుకోవడంతో విజయ్‌కు భారీ మెజారిటీ దక్కింది.
16. అండర్ డాగ్ ఎఫెక్ట్: వ్యక్తిగత, వృత్తిపరమైన దాడులు ఎదురైనప్పుడు.. ప్రజలు ఆయనకు అండగా నిలబడాలనే భావన బలపడింది.
మొత్తానికి గ్రౌండ్ లెవెల్ పార్టీ బిల్డింగ్ కంటే ప్రజల హృదయాలను గెలుచుకోవడం ద్వారా విజయ్ ఈ రాజకీయ విజయాన్ని సాధించగలిగారు.
