గెలిచినంత ఈజీ కాదు బెంగాల్‌లో ప్రభుత్వాన్ని నడపటం.. బీజేపీ ముందున్న పెద్ద చిక్కు ఇదే..

గెలిచినంత ఈజీ కాదు బెంగాల్‌లో ప్రభుత్వాన్ని నడపటం.. బీజేపీ ముందున్న పెద్ద చిక్కు ఇదే..

పశ్చిమ బెంగాల్ రాజకీయం చాలా వింతగా ఉంటుంది. అక్కడ గెలుపోటములను కేవలం ఓట్లతో కొలవలేం. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల ట్రెండ్స్ చూస్తుంటే మే 4న బెంగాల్ గడ్డపై బీజేపీ జెండా ఎగిరేలా కనిపిస్తోంది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. బీజేపీ బెంగాల్‌ను గెలవచ్చు కానీ.. బెంగాలీ ప్రజల మనస్సును గెలుస్తుందా? అంటే ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో పడ్డారు రాజకీయ పండితులు..

బెంగాలీ మైండ్ సెట్: 
బెంగాలీలకు ఒక రకమైన 'మేధో గర్వం' ఉంటుంది. వారి దృష్టిలో బెంగాల్ అంటే ఒక ప్రత్యేకమైన సంస్కృతి, రవీంద్రనాథ్ ఠాగూర్ కవితలు, ఘటక్ సినిమాలు, చేపల పులుసుతో విందు. బీజేపీ ఈ గడ్డపైకి రావడం అంటే.. ఏదో బయటి శక్తులు తమ ఇంట్లోకి జొరబడ్డాయనే ఫీలింగ్ వారిలో బలంగా ఉంది. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేసినా.. అక్కడి పెద్దల మనసులోని గోడలను దాటి లోపలికి వెళ్లడం కమలనాథులకు పెను సవాలే.

చేప ఒక్కటే..
ఎన్నికల ప్రచారంలో నాయకులు చేపలను పట్టుకుని ఫోజులిచ్చారు. కానీ బెంగాలీలకు ఆ చేప ఇప్పుడు ఒక వివాదాస్పద వస్తువులా కనిపిస్తోంది. "మా చేపను మీరు పట్టుకోవడమేంటి?" అనే ఒక రకమైన అభద్రతా భావం వారిలో మొదలైంది. బీజేపీ వస్తే బెంగాలీ లైఫ్ స్టైల్ మారిపోతుందా? హిందీ సామ్రాజ్యవాదం వచ్చేస్తుందా? అనే భయం వారిని వెంటాడుతోంది. అందుకే బీజేపీ గెలిచినా.. ఆ గెలుపును వారు అంత ఈజీగా జీర్ణించుకోలేకపోవచ్చు.

సింగం వర్సెస్ పుష్ప: 
ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే.. టీఎంసీ వర్సెస్ బీజేపీ యుద్ధం సింగం వర్సెస్ పుష్ప లాంటి మాస్ మసాలా సినిమాను తలపిస్తోంది. బీజేపీ గెలిస్తే టీఎంసీ ఎమ్మెల్యేలు క్యూ కడతారు, ఒకవేళ దీదీ గెలిస్తే రివర్స్ గేర్ పడుతుంది. కానీ ఇదంతా కేవలం పవర్ పాలిటిక్స్ మాత్రమే. లోతుగా చూస్తే.. లెఫ్ట్ పార్టీల ఓటర్లు బీజేపీకి ఓటేసి టీఎంసీని సాగనంపుదాం, తర్వాత బీజేపీని మనమే కొడదాం అనే స్ట్రాటజీని ఫాలో అయ్యారు. కానీ ఈ వ్యూహం బీజేపీకి ఎంతవరకు పట్టునిస్తుందో వేచి చూడాలి.

గుజరాత్ మోడల్ వర్సెస్ పార్టీ-సొసైటీ..
బెంగాల్‌లో ఒక వింత వ్యవస్థ ఉంది. అక్కడ ప్రతి నైబర్‌హుడ్, క్లబ్, పూజా కమిటీ అధికార పార్టీ చెప్పుచేతల్లోనే ఉంటాయి. లెఫ్ట్ నుంచి దీదీ వరకు ఇదే నడిచింది. ఇప్పుడు బీజేపీ ఈ పార్టీ-సొసైటీని ఎలా హ్యాండిల్ చేస్తుంది? బీజేపీకి వెన్నుముకగా ఉన్న కార్పొరేట్ క్యాపిటల్.. బెంగాల్‌లోని లోకల్ సెటప్‌తో గొడవ పడుతుందా? మోదీ కోటరీకి బెంగాల్ ఒక శత్రువుగా మారుతుందా? అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.

క్లైమాక్స్ ఏంటి?
జవహర్ సిర్కార్ వంటి విశ్లేషకులు భయపడుతున్నట్లుగా.. బీజేపీ గెలుపు తర్వాత బెంగాల్‌లో పరిస్థితులు మరీ ఉద్రిక్తంగా మారతాయా? అవుట్‌సైడర్ నినాదం హింసాత్మక మలుపు తీసుకుంటుందా? దశాబ్దాలుగా మూసుకుపోయిన మేధో వర్గం ఇప్పుడు బీజేపీ పేబ్యాక్ టైమ్ చూస్తోందా? ఏది ఏమైనా.. బెంగాల్‌లో బీజేపీ జెండా పాతడం ఒక ఎత్తు.. అక్కడి ప్రజల ఆత్మీయతను, సంస్కృతిని తనలో కలుపుకోవడం మరో ఎత్తు అని విశ్లేషకులు అంటున్నారు. ఓట్లలో బీజేపీ గెలవచ్చు కానీ, బెంగాలీల కలల ప్రపంచంలోకి ప్రవేశం దొరకడం మాత్రం అంత ఈజీ కాదని తెలుస్తోంది. చూడాలి వీటన్నింటినీ బీజేపీ ఎలా హ్యాండిల్ చేస్తుంది.. టీఎంసీ ఎలా పావులు కదుపుతుందో వేచి చూడాల్సిందే మరి.