తమిళ సినిమా ఇండస్ట్రీలో విజయ్ ఒక తిరుగులేని పేరు. కేవలం 69 సినిమాలతోనే ఆయన సౌత్ ఇండియాలో టాప్ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. ఇప్పుడు ఆయన సినీ ప్రయాణాన్ని పక్కన పెట్టి, 'తమిళగ వెట్రి కజగం' (TVK) అనే పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
విజయ్ ఒక సినీ కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ ఒక ప్రముఖ దర్శకుడు, తల్లి శోభ గారు మంచి సింగర్. 1974లో పుట్టిన ఆయన అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. చిన్నప్పుడే బాలనటుడిగా కెమెరా ముందుకు వచ్చిన విజయ్, 18 ఏళ్ల వయసులో 'నాలయ తీర్పు' సినిమాతో హీరోగా మారారు. అభిమానులు ఆయన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ 'తలపతి' అని పిలుచుకుంటారు.
విజయ్ కెరీర్‌లో 'తేరి', 'మాస్టర్', 'బీస్ట్' వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ ఉన్నాయి. 2023లో వచ్చిన 'లియో' సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) సినిమాతో ప్రేక్షకులను అలరించారు. రాజకీయాల్లోకి రాక ముందు ఆయన నటించిన 'జన్ నాయగన్' సినిమా ఆయన చివరి సినిమాగా ప్రచారం పొందింది.
విజయ్ నటించిన 'జన్ నాయగన్' సినిమా విడుదలకు ముందే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. సెన్సార్ బోర్డు అడ్డంకులు, కోర్టు కేసులు మరియు ఆన్‌లైన్‌లో సినిమా లీక్ అవ్వడం వంటి సమస్యలు ఈ చిత్రాన్ని చుట్టుముట్టాయి. ఈ ఏడాది ఆరంభంలోనే రావాల్సిన ఈ సినిమా ఇంకా థియేటర్లకు రాలేదు.
పొలిటికల్ ఎంట్రీ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) సంచలనం సృష్టిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చిన మొదటిసారే విజయ్ తన సత్తా చాటుతున్నారు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం TVK పార్టీ ఏకంగా 100కు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది.
అయితే తమిళనాడులో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 సీట్లు కావాలి. ప్రస్తుతం విజయ్ పార్టీ 101 సీట్లలో ఆధిక్యంలో ఉండటంతో, సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు అధికారంలో ఉన్న DMK కూటమి కేవలం 50 సీట్లకే పరిమితం కాగా, ప్రతిపక్ష AIADMK కూటమి 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
టీవీకే పార్టీకి సుమారు 32% ఓట్లు పడ్డాయి. ఇది డీఎంకే ఓట్ల శాతంతో సమానంగా ఉండటం విశేషం. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న రెండు పెద్ద పార్టీల ఓట్లను విజయ్ భారీగా చీల్చారు.
విజయ్ హవా
ఈ ఫలితాలపై టీవీకే నాయకుడు ఫెలిక్స్ గెరాల్డ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 'విజయ్ హావ' నడుస్తోందని అన్నారు. ప్రజలు డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలతో విసిగిపోయారని, అందుకే మార్పు కోరుకుంటూ విజయ్‌కు పట్టం కడుతున్నారని ఆయన పేర్కొన్నారు. తమకు ఎవరి మద్దతు అవసరం లేదని, సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు.
రాజధాని చెన్నైలో తప్ప, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నింటిలోనూ విజయ్ పార్టీ హవా కొనసాగుతోంది. ఈసారి తమిళనాడులో రికార్డు స్థాయిలో 84.69% ఓటింగ్ నమోదైంది. ఈ భారీ ఓటింగ్ విజయ్‌కు కలిసివచ్చినట్లు కనిపిస్తోంది.
మొత్తానికి, తొలి ఎన్నికల్లోనే విజయ్ సాధిస్తున్న ఈ ఫలితాలు తమిళనాడు రాజకీయ చిత్రపటాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. దీంతో ఆ పార్టీ తొలి ఎన్నికల బరిలోనే మెజారిటీకి చేరువలో నిలిచింది.
