ఆరు నెలల్లోనే ట్రిపుల్ ఆర్, రింగ్ రైల్!..వార్ మోడ్ లో పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయం

ఆరు నెలల్లోనే ట్రిపుల్ ఆర్, రింగ్ రైల్!..వార్ మోడ్ లో పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయం

రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌), రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టుల పనులు వచ్చే ఆరు నెలల్లోనే  ప్రారంభం కానున్నాయి. ఈ రెండు మెగా ప్రాజెక్టులను అత్యంత వేగంగా ‘వార్ మోడ్’లో పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇప్పటికే ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ నార్త్ పార్ట్ ప్రతిపాదనలు పీపీపీ అప్రైజల్ కమిటీ పరిశీలనలో ఉండగా, అక్కడ గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభించనున్నారు.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రవాణా రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌), రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టుల పనులు వచ్చే ఆరు నెలల్లోనే క్షేత్రస్థాయిలో ప్రారంభం కానున్నాయి. ఈ రెండు మెగా ప్రాజెక్టులను అత్యంత వేగంగా ‘వార్ మోడ్’లో పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇప్పటికే ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ ఉత్తర భాగం (నార్త్ పార్ట్) ప్రతిపాదనలు పీపీపీ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) పరిశీలనలో ఉండగా, అక్కడ గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభించనున్నారు. 

దక్షిణ భాగానికి సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) పనులు తుది దశకు చేరుకున్నాయి. సుమారు 182 కిలోమీటర్ల పొడవునా సాగే ఈ దక్షిణ భాగం అలైన్‌‌మెంట్‌‌ను కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఇప్పటికే ప్రాథమికంగా ఖరారు చేసింది. మరో రెండు, మూడు నెలల్లోనే సౌత్ పార్ట్‌‌కు సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్ వెలువడనుంది. ఇక ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌కు సమాంతరంగా రింగ్ రైల్ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. రోడ్డు, రైలు రెండు పనులు ఒకేసారి ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

నార్త్ పార్ట్ క్లియరెన్స్... పనులకు ముహూర్తం!

రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం పనులకు సంబంధించి కేంద్రం కసరత్తు పూర్తి చేసింది. సుమారు 158 కిలోమీటర్ల మేర సాగే ఈ నార్త్ పార్ట్‌‌కు సంబంధించిన ఫైల్ ప్రస్తుతం పీపీపీ అప్రైజల్ కమిటీ వద్ద ఉంది. అక్కడ ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ లోపు దక్షిణ భాగం (సౌత్ పార్ట్)కు సంబంధించిన డీపీఆర్ పనులు కూడా వేగంగా పూర్తి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. 

భూసేకరణ ప్రక్రియలో ఉన్న చిన్నపాటి సాంకేతిక ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉండేలా రింగ్ రైల్ ప్రాజెక్టును కూడా కేంద్ర రైల్వే శాఖ ప్రతిపాదించింది. దాదాపు 400 కిలోమీటర్ల మేర సాగే ఈ భారీ రైల్వే లైన్‌‌కు సంబంధించిన డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. ఆర్‌‌ఆర్‌‌ఆర్ వెంటే ఈ రైల్వే లైన్ రానుండటంతో భూసేకరణ భారం భారీగా తగ్గడమే కాకుండా, ప్రయాణికులకు కూడా ఎంతో సౌలభ్యం కలగనుంది. వచ్చే ఆరు నెలల్లోపు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులను పూర్తి చేసి, పనుల ప్రారంభానికి రైల్వే బోర్డు కసరత్తు చేస్తోంది.

వార్‌‌ మోడ్‌‌లో పనులు..

సాధారణంగా దశాబ్దాల పాటు సాగే భారీ ప్రాజెక్టులను ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ‘వార్ మోడ్’లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రైల్వే శాఖలు సమన్వయంతో పని చేస్తూ ఆరు నెలల గడువును డెడ్‌‌లైన్‌‌గా పెట్టుకున్నాయి. భూసేకరణ కోసం నిధుల కేటాయింపు, అలైన్‌‌మెంట్ ఖరారు వంటి కీలక ఘట్టాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడా జాప్యం జరగకుండా ఉండేందుకు పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌‌నర్‌‌షిప్) పద్ధతిని అనుసరిస్తున్నారు. 

దీంతో  ప్రైవేట్ పెట్టుబడులు పెరగడమే కాకుండా పనులు నాణ్యతతో, వేగంగా జరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రెండు మెగా ప్రాజెక్టులు  రింగ్ రోడ్డు, రింగ్ రైల్ వెంబడి కొత్త లాజిస్టిక్ పార్కులు, గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ హబ్‌‌లు ఏర్పడతాయని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల లక్షలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.  ద్వితీయ శ్రేణి నగరాలు హైదరాబాద్‌‌కు త్వరితగతిన అనుసంధానం కావడం వల్ల అభివృద్ధి అంతా ఒకే చోట కాకుండా వికేంద్రీకరణ జరుగుతుంది.