మాజీ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి గుండెపోటు...9వ సారి సీపీఆర్తో కదిలిన గుండె

మాజీ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి గుండెపోటు...9వ సారి సీపీఆర్తో కదిలిన గుండె
  •     డాక్టర్ల బృందం కృషితో తప్పిన ప్రాణాపాయం
  •     చనిపోయారంటూ సోషల్​మీడియాలో తప్పుడు ప్రచారం
  •     గ్రీన్​ చానల్​ ఏర్పాటు చేసి హైదరాబాద్​కు తరలింపు 

వరంగల్‍/నర్సంపేట, వెలుగు: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‍ఎస్‍ నేత పెద్ది సుదర్శన్‍రెడ్డికి ఆదివారం ఉదయం గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని ప్రైవేట్ హాస్పిటల్‍కు తీసుకువెళ్లగా, కార్డియాలజిస్ట్‍ డాక్టర్‍ మమతారెడ్డి ఆధ్వర్యంలోని డాక్టర్ల బృందం వరుసగా సీపీఆర్‍ చికిత్స అందించారు. 9వ సారి సీపీఆర్‍ చేయడంతో ఆయన గుండెలో తిరిగి కదలిక వచ్చింది. వెంటనే స్టంట్‍ వేసి, మెరుగైన ట్రీట్‍మెంట్ కోసం గ్రీన్‍ చానల్‍ ఏర్పాటు చేసి అంబులెన్స్‍లో హైదరాబాద్‍లోని ప్రైవేట్‍ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. సుదర్శన్‍రెడ్డి రెండ్రోజులుగా జ్వరం, కడుపునొప్పితో బాధపడుతున్నారని, శనివారం రాత్రి వరంగల్‍కు వచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లారు.

సోషల్​ మీడియాలో తప్పుడు ప్రచారం

పెద్ది సుదర్శన్‍రెడ్డి హార్ట్‍స్ట్రోక్‍తో చనిపోయారంటూ సోషల్‍ మీడియాలో వదంతులు వ్యాపించడంతో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి లీడర్లు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన డాక్టర్‍ మమతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆయన బతికే ఉన్నారని, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‍ వల్ల పల్స్, బీపీ పెరిగి గుండెనొప్పి వచ్చిందని స్పష్టం చేశారు. 9వసారి సీపీఆర్‍ చేయగా గుండె కొట్టుకుందని తెలుపడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

కేటీఆర్‍, హరీశ్​రావు పరామర్శ

విషయం తెలియగానే బీఆర్ఎస్‍ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ కేటీఆర్‍, హరీశ్‍రావు హుటాహుటిన వరంగల్‍కు చేరుకుని డాక్టర్లతో మాట్లాడారు. ఎయిర్‍బస్‍ తెప్పించడానికి సమయం పడుతుండటంతో సీఎం రేవంత్‍రెడ్డితో మాట్లాడి గ్రీన్‍ చానల్‍ ఏర్పాటు చేయించారు. బీఆర్ఎస్‍ నేతలు వినోద్‍ కుమార్‍, సత్యవతి రాథోడ్‍, దాస్యం వినయ్‍ భాస్కర్‍, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‍, దాస్యం వినయ్‍ భాస్కర్‍, గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్‍ నాయక్‍, కాంగ్రెస్‍ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్‍.నాగరాజు, కుడా చైర్మన్‍ ఇనగాల వెంకట్రామిరెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, తక్కళ్లపల్లి రాజేశ్వరరావు తదితరులు ఆస్పత్రికి వచ్చి పెద్దిని పరామర్శించారు.