పెండింగ్ బిల్లులు ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తం : మాజీ సర్పంచుల సంఘం

పెండింగ్ బిల్లులు ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తం : మాజీ సర్పంచుల సంఘం
  • జూన్ 1న ‘చలో సీఎం క్యాంప్ ఆఫీస్’కు మాజీ సర్పంచ్​ల పిలుపు

హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి అప్పులపాలైన తమకు ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచుల సంఘం జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమపై  కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. జూన్ 1న సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర మాజీ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. మాజీ సర్పంచుల పదవీకాలం ముగిసి 32 నెలలు గడుస్తున్నా.. తాము చేసిన పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడం దారుణమన్నారు. బిల్లుల కోసం మంత్రులు, అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.   సర్కారు తీరు మార్చుకోకపోవడంతో  జూన్ 1న ‘చలో సీఎం క్యాంప్ ఆఫీస్’ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ బిల్లులు రావాల్సిన మాజీ సర్పంచులందరూ ముట్టడి కార్యక్రమానికి తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.