పెండింగ్ కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మార్గం:  సుప్రీంకోర్టు మాజీ జడ్జి 

పెండింగ్ కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మార్గం:  సుప్రీంకోర్టు మాజీ జడ్జి 

హైదరాబాద్, వెలుగు: కోర్టుల ద్వారా కేసులను విచారించి తీర్పు చెప్పేందుకు ఏండ్ల సమయం పడుతున్న నేపథ్యంలో మీడియేషన్‌‌‌‌ ద్వారా కేసుల్ని ఉభయపక్షాలు రాజీ చేసుకునే విధానానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ లావు నాగేశ్వరరావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హా శాంతివనం మెడిటేషన్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో హైకోర్టు న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు ‘మధ్యవర్తిత్వం’ అంశంపై మూడు రోజుల పాటు జరిగే శిక్షణా కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు.

హైకోర్టుల న్యాయమూర్తులు మధ్యవర్తిత్వ ఆవశ్యత గురించి పూర్తి స్థాయిలో అవగాహన పొందాలన్నారు. కేసుల పెండింగ్‌‌‌‌ కారణంగా తీర్పుల జాప్యం ఫలితంగా జనం తమకు అన్యాయం జరుగుతోందని భావించినా, పక్షపాత పరిస్థితులు ఉన్నాయని భావించినా సామాన్యుడు న్యాయం కోసం మరో దారిని ఎంచుకునే పరిస్థితులు ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఢిల్లీ, బెంగళూరు వంటి చోట్ల మధ్యవర్తిత్వ కేంద్రాలతో మంచి ఫలితాలు ఉన్నాయని, తెలంగాణలోని అన్ని కోర్టులు కూడా మధ్యవర్తిత్వం విధానంలో కేసుల్ని పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ పి.నవీన్‌‌‌‌రావు మాట్లాడుతూ, రాష్ట్ర హైకోర్టులో 2.40 లక్షలు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో 8.40 లక్షల పెండింగ్‌‌‌‌ కేసులు ఉన్నాయని చెప్పారు. మీడియేషన్‌‌‌‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.