పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రక మార్పు రాబోతుందన్న సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్ ఉర్రూతలూగుతోంది. మే 4వ తేదీన వెలువడుతున్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ సుమారు 195 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం, అధికార టీఎంసీ 95 స్థానాలకే పరిమితం కావడంతో బెంగాల్ కేంద్రంగా పనిచేసే కంపెనీల షేర్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఇన్వెస్టర్ల నమ్మకం ఏ రేంజ్‌లో ఉందంటే.. కొన్ని షేర్లు ఏకంగా 10 శాతం వరకు లాభపడి మార్కెట్‌ను ఆశ్చర్యపరిచాయి.
బుల్ రన్ లో బెంగాలీ షేర్లు..
కోల్‌కతా కేంద్రంగా వ్యాపారాలు సాగించే శ్రీరామ్ ప్రాపర్టీస్ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఉత్తరపారాలో కంపెనీ నిర్మిస్తున్న భారీ టౌన్‌షిప్ శ్రీరామ్ గ్రాండ్ సిటీకి కొత్త ప్రభుత్వం నుంచి మరింత సహకారం అందుతుందన్న ఆశలు ఇందుకు కారణంగా ఉంది. వీటితో పాటు CESC, బంధన్ బ్యాంక్, సెన్కో గోల్డ్, ఇమామీ, ఆండ్రూ యూల్ కంపెనీల షేర్లు కూడా లాభాలతో సునామీ సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ ప్రకటించిన మహిళలకు రూ.3వేలు నెలవారీ భృతి హామీతో బాజార్ స్టైల్ రిటైల్ లాంటి కన్స్యూమర్ స్టాక్స్ పండగ చేసుకుంటున్నాయి.
బెంగాల్ సరికొత్త ఆర్థిక ఇంజిన్..
బెంగాల్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే కేంద్రం నుంచి నిధుల ప్రవాహం పెరుగుతుందని, ఆర్థిక విశ్లేషకులు భారీ అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం బెంగాల్ జీడీపీ వృద్ధి రేటు సుమారు 9.3% నుండి 12% వరకు ఉండగా.. బీజేపీ అధికారంలోకి వస్తే పారిశ్రామికీకరణ, మెట్రో ప్రాజెక్టుల పూర్తి, స్టార్టప్ ఎకోసిస్టం బూస్ట్‌తో ఇది రెండంకెల వృద్ధిని సుస్థిరం చేసుకుంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీంతో రాబోయే 5 ఏళ్లలో బెంగాల్ జీడీపీలో కనీసం 2% నుండి 3% అదనపు వృద్ధిని అందించొచ్చని వారు చెబుతున్నారు. ఇది దేశ జీడీపీని 50 పాయింట్ల మేర పెంచొచ్చని చెబుతున్నారు.
పారిశ్రామిక విప్లవం..
రానున్న బెంగాల్ బీజేపీ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానంపై ఆశావహంగా ఉన్నట్లు బెర్గర్ పెయింట్స్ సీఈఓ అభిజిత్ రాయ్ అన్నారు. నిలిచిపోయిన మెట్రో ప్రాజెక్టుల పూర్తి, కోల్‌కతాలో స్టార్టప్ హబ్‌ల ఏర్పాటు వంటివి బెంగాల్ ముఖచిత్రాన్ని మార్చేస్తాయని మార్కెట్ గట్టిగా నమ్ముతోంది. టీఎంసీకి చెందిన 20 మందికి పైగా మంత్రులు వెనుకంజలో ఉండటం, బీజేపీ క్లీన్ స్వీప్ దిశగా వెళ్తుండటంతో.. బెంగాల్ ఆర్థిక రంగంలో కొత్త జోరు మొదలైందని దలాల్ స్ట్రీట్ కోడై కూస్తోంది.
