చోరీలు చేస్తున్న నలుగురు అరెస్ట్‌‌

చోరీలు చేస్తున్న నలుగురు అరెస్ట్‌‌
  •      41 తులాల బంగారం, రెండు కేజీల వెండి స్వాధీనం

యాదాద్రి, వెలుగు : వరుస చోరీలు చేస్తున్న మహిళ సహా ముగ్గురు వ్యక్తులను యాదాద్రి జిల్లా పోలీసులు శనివారం అరెస్ట్‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ తరుణ్‌‌ జోషి, డీసీపీ రాజేశ్‌‌చంద్ర వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన పొట్టేటి మరియదాసు అతడి తమ్ముడు శంతయ్య ఫ్యామిలీలు 16 ఏండ్ల కింద యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామానికి వచ్చి నివాసం ఉంటున్నారు.

 మరియదాసుకు మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన కర్నె లక్ష్మి పరిచయం కావడంతో ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. మరియదాసుకు తన ఫ్యామిలీకి తోడు లక్ష్మి ఫ్యామిలీని కూడా పోషించడం కష్టంగా మారడంతో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా 2019లో భువనగిరి పట్టణంలో 14 గొర్రెలను దొంగిలించాడు. తర్వాత తమ్ముడు శంతయ్యతో పాటు లక్ష్మి, ఆమె సోదరుడు బాణాల రాజేశ్‌‌తో కలిసి ముఠాగా ఏర్పడి 2023 నుంచి జిల్లాలోని పలు పోలీస్‌‌ స్టేషన్ల పరిధిలో చోరీలు చేశారు. 

ముందుగా చోరీ చేయాలనుకున్న గ్రామానికి వెళ్లి శివారులోని ఇండ్ల వద్ద రెక్కీ నిర్వహించేవారు. ఆ తర్వాత రాత్రి ఆ ఇంటి వద్దకు వెళ్లి ఇంట్లోని మహిళల మెడలో పుస్తెలతాళ్లను దొంగిలించేవారు. ఇలా గత నెల 27 నుంచి ఈ నెల 18 వరకు 10 మంది మహిళల పుస్తెలతాళ్ల లాక్కెళ్లడంతో పాటు, మరో ఐదు ఇండ్లలో దొంగతనం చేశారు. ఫిర్యాదులు పెరగడంతో అలర్ట్‌‌ అయిన పోలీసులు పెట్రోలింగ్‌‌ నిర్వహించడంతో పాటు వాహనాల తనిఖీ మొదలు పెట్టారు.

 ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆలేరు శివారులోని జీడికల్​క్రాస్‌‌ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అటువైపుగా వచ్చిన వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీల విషయం బయటపడింది. దీంతో మరియదాసు, శంతయ్య, లక్ష్మి, రాజేశ్‌‌ను అరెస్ట్‌‌ చేయడంతో పాటు వారి వద్ద నుంచి 41 తులాల బంగారు నగలు, రెండు కిలోల వెండి ఆభరణాలతో పాటు బైక్‌‌, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొని, నలుగురిని రిమాండ్‌‌కు పంపినట్లు సీపీ తెలిపారు.