5 రోజుల్లో నలుగురు పిల్లలకు జన్మ.. యూపీ మహిళకు రేర్ నార్మల్ డెలివరీ

5 రోజుల్లో నలుగురు పిల్లలకు జన్మ.. యూపీ మహిళకు రేర్ నార్మల్ డెలివరీ

లక్నో: ఉత్తరప్రదేశ్​లోని సంభల్ జిల్లాకు చెందిన 31 ఏండ్ల మహిళ కేవలం 5 రోజుల వ్యవధిలో నలుగురు బిడ్డలకు(ఇద్దరు బాబులు, ఇద్దరు పాపలు) జన్మనిచ్చింది. వైద్య పరిభాషలో అత్యంత క్లిష్టమైన, అరుదైన ఈ ప్రసవం మొరాదాబాద్‌‌‌‌‌‌‌‌లోని తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ ఆస్పత్రిలో జరిగింది. నలుగురు పిల్లలూ సాధారణ ప్రసవం ద్వారా జన్మించడం విశేషం. 

అమీనా అనే మహిళ గర్భం దాల్చిన ప్రారంభంలోనే ఆల్ట్రా సౌండ్ స్కాన్ ద్వారా ఆమె గర్భంలో నాలుగు పిండాలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. కనీసం ఇద్దరు పిల్లలనైనా క్షేమంగా కాపాడుకునేందుకు ఫీటల్ రిడక్షన్ (పిండాల సంఖ్యను తగ్గించడం) చేయాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. అయితే, నలుగురు పిల్లలనూ ఉంచుకోవాలని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. గర్భధారణ సమయంలో అమీనా బీపీ, లివర్ సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. 

దీనివల్ల ఆమెను పలుమార్లు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించాల్సి వచ్చింది. అమీనా ఈ నెల 9న మొదటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబు బరువు కేవలం 710 గ్రాములే. అప్పటికి ఆమెకు 7 నెలల గర్భమే కావడంతో, డాక్టర్లు మిగిలిన పిల్లల ప్రసవాన్ని ఆలస్యం చేసేందుకు అమీనా ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచారు. ఈ నెల 14న ఆమె ఒక బాబు, ఇద్దరు పాపలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, పిల్లలు తమ పర్యవేక్షణలో ఉన్నారని, వారి ఆరోగ్యం మెరుగుపడుతోందని డాక్టర్లు పేర్కొన్నారు.