విదేశాల్లోని ఇండియన్ స్టూడెంట్ల నుంచి రూ.2 కోట్లు వసూలు

 విదేశాల్లోని ఇండియన్ స్టూడెంట్ల నుంచి రూ.2 కోట్లు వసూలు
  •  బోనస్ ​పాయింట్స్ వస్తాయంటూ ట్రాప్ 
  •  దుబాయ్​ కేంద్రంగా కొనసాగుతున్న దందా
  •  32 మంది నుంచి రూ.2కోట్లు వసూలు చేసిన నిందితులు 


హైదరాబాద్‌‌, వెలుగు:బోనస్​పాయింట్లు, యూనివర్సిటీ ఫీజులో డిస్కౌంట్​అంటూ విదేశాల్లో చదువుతున్న మన స్టూడెంట్లను మోసం చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను సిటీ సైబర్‌‌‌‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల బ్యాంక్ అకౌంట్స్‌‌లోని రూ.2.71లక్షలు ఫ్రీజ్‌‌ చేశారు. క్రెడిట్, డెబిట్‌‌కార్డులు, చెక్‌‌ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. యూఎస్ఏ, కెనడాలో చదువుకుంటున్న 32 మంది స్టూడెంట్లను మోసం చేసి రూ.2 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. నిందితుల వివరాలను సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎస్ ప్రసాద్‌‌తో కలిసి సిటీ జాయింట్‌‌ సీపీ గజరావ్‌‌ భూపాల్‌‌ మంగళవారం వెల్లడించారు. సిటీలోని కొత్తపేటకు చెందిన దేవరశెట్టి గౌతమ్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.  అమెరికా, కెనడాలో చదువుకుంటున్న ఇండియన్ స్టూడెంట్ల వివరాలు సేకరించాడు. అందరిని కలుపుతూ వాట్సాప్ గ్రూప్‌‌ క్రియేట్‌‌ చేశాడు. తన ద్వారా చెల్లింపులు చేస్తే బోనస్ పాయింట్స్ వస్తాయని, యూనివర్సిటీ ఫీజులో 10 శాతం డిస్కౌంట్​వస్తుందని నమ్మించాడు. ప్రతిఒక్కరి ఫీజు వివరాలు తీసుకున్నాడు. వాటిని హైదరాబాద్‌‌లోని కోహీర్కర్ నితీశ్ అనే వ్యక్తికి పంపాడు. నితీశ్​ఆ వివరాలను దుబాయ్‌‌లోని జిబ్రాన్‌‌ అనే సైబర్ నేరస్తుడికి షేర్‌‌‌‌ చేశాడు. అక్కడి నుంచి జిబ్రాన్ తన వద్ద ఉన్న ఫేక్‌‌ క్రెడిట్​కార్డులతో ట్రాన్సాక్షన్లు చేయడం మొదలుపెట్టాడు. స్టూడెంట్ల ఫీజులను ఆయా యూనివర్సిటీల అకౌంట్లకు ట్రాన్స్‌‌ఫర్ చేశాడు. ఈ క్రమంలో 10 శాతం డిస్కౌంట్‌‌ మినహా మిగితా మొత్తాన్ని స్టూడెంట్లు గౌతమ్​కు పంపేవారు. అందుకు గౌతమ్ హైదరాబాద్‌‌లోని తన తండ్రి దేవరశెట్టి వెంకటేశ్వర్లు బ్యాంక్ అకౌంట్ వినియోగిస్తున్నాడు. మొత్తం డబ్బులో గౌతమ్​35 శాతం కమీషన్‌‌గా తీసుకునేవాడు. మిగిలిన డబ్బును నితీశ్ కు పంపించేవాడు. నితీశ్ 5 శాతం తన కమీషన్ గా తీసుకుని మిగిలిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీ రూపంలో దుబాయ్‌‌లోని జిబ్రాన్‌‌కు పంపించేవాడు.

యూనివర్సిటీలపై బ్యాంకులు కేసులు 

అయితే జిబ్రాన్‌‌ ద్వారా జరిగిన క్రెడిట్‌‌ కార్డు పేమెంట్స్‌‌ను యూఎస్‌‌ఏ, కెనడా యూనివర్సిటీల్లో డిపాజిట్​అయ్యాయి. స్టూడెంట్లు తమ స్టడీస్ కంటిన్యూ చేస్తున్నారు. అయితే జిబ్రాన్‌‌ జరిపిన ట్రాన్సాక్షన్స్​ఫ్రాడ్​అని అక్కడి బ్యాంకులు ఇటీవల గుర్తించాయి. ఆయా యూనివర్సిటీలపై కేసులు పెట్టాయి. దీంతో యూనివర్సిటీలు తమ అకౌంట్లలో  డిపాజిట్ అయిన స్టూడెంట్ల ఫీజులను ఆయా బ్యాంకులకు రిటర్న్‌‌ చేశాయి. చేసేదేం లేక బాధిత స్టూడెంట్లు యూనివర్సిటీలకు మొత్తం ఫీజులు చెల్లించారు. వారి ఫిర్యాదుతో సైబర్​పోలీసులు దర్యాప్తు చేయగా గౌతమ్​గ్యాంగ్ ఇండియాకు చెందిన 32 మంది స్టూడెంట్లను మోసం చేసినట్లు తేలింది. నిందితులపై కేసు నమోదు చేశారు.