హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది నుంచి డిగ్రీలో సెకండ్ లాంగ్వేజీగా ఫ్రెంచ్-ను ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ముందుగా రెసిడెన్షియల్ గురుకులాల్లో అమలు చేయనున్నట్లు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రెంచ్‌ను ద్వితీయ భాషగా తీసుకొచ్చేందుకు కొన్నేళ్ళుగా చేస్తున్న కృషి ఫలించిందని వెల్లడించారు. దానికి సంబంధించిన బుక్స్, టీచింగ్ సిబ్బందిని ఇప్పటికే సిద్ధం చేశామని చెప్పారు. ఫ్రెంచ్- భాష నేర్చుకున్న విద్యార్థులు.. విదేశాల్లోనూ మంచి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తద్వారా డిగ్రీ కోర్సులకు మరింత ఆదరణ పెరుగుతుందని లింబాద్రి తెలిపారు.
