ఆ ఇండ్లు దూరం.. అందుకే పోతలేం..నోటీసులకు డబుల్ బెడ్‌‌రూమ్ ఇండ్ల లబ్ధిదారుల రిప్లై

ఆ ఇండ్లు దూరం.. అందుకే పోతలేం..నోటీసులకు డబుల్ బెడ్‌‌రూమ్ ఇండ్ల లబ్ధిదారుల రిప్లై
  • హైదరాబాద్‌‌లో అధికారుల నోటీసులకు డబుల్ బెడ్‌‌రూమ్ ఇండ్ల లబ్ధిదారుల రిప్లై​ 
  •     బీఆర్ఎస్​ హయాంలో సిటీకి దూరంగా ఇండ్ల నిర్మాణం 
  •     కేటాయించిన ఇండ్లలో ఉండని లబ్ధిదారులు 
  •     తాజాగా 14 వేల కుటుంబాలకు నోటీసులు 
  •     10 కిలో మీటర్ల పరిధిలో ఇండ్లు కేటాయించే యోచనలో ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్​ ప్రభుత్వం హైదరాబాద్​ సిటీకి దూరంగా నిర్మించిన డబుల్​బెడ్‌‌రూమ్ ఇండ్లలో ఉండేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో తాళాలు వేసి వెళ్లిన సుమారు 14 వేల కుటుంబాలకు ఇటీవల రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వగా, తాము పనిచేసే చోటుకు దూరంగా ఉండడం వల్లే ఉండలేకపోతున్నామని 5 వేల మంది లబ్ధిదారులు రిప్లై ఇచ్చారు. దీంతో అలాంటి వారికి 10 కిలో మీటర్ల పరిధిలో అందుబాటులో ఉన్న ఇండ్లను కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వం సిటీలోని పేదల కోసం ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని కొల్లూరుతో పాటు, రాంపల్లి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్​లో ‘డబుల్’ ఇండ్లను శాంక్షన్ చేసిన సంగతి తెలిసిందే. 


కొల్లూరులో రూ.1,500 కోట్లతో 15,660 ఫ్లాట్లను 125 బ్లాకుల్లో నిర్మించింది. 2023లో లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించింది. కానీ, వాటిలో సగం ఇండ్లలో లబ్ధిదారులెవరూ ఉండడం లేదు. ఫ్లాట్లకు తాళాలు వేసి, ఎప్పట్లాగే పాత చోటే అద్దెకుంటున్నారు. దీంతో ఇటీవల సర్వే నిర్వహించిన అధికారులు తాళాలు వేసి ఉన్న లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చారు. అందులో సుమారు 5 వేల మంది  నుంచి ఒకే తరహా సమాధానం వచ్చింది. తాము ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతానికి 30 నుంచి 40 కిలో మీటర్ల దూరంలో డబుల్ బెడ్‌‌రూమ్ ఇండ్లు కేటాయించారని, దూరంగా ఉండటంతోనే అందులో నివాసం ఉండలేకపోతున్నామని చెప్పారు. లబ్ధిదారుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులే ఉన్నారు. ఆయా ప్రాంతాల నుంచి పనుల కోసం నగరానికి వచ్చిపోవడం వల్ల దూరభారంతో పాటు రవాణా ఖర్చులు ఎక్కువవుతున్నాయని చెప్తున్నారు. అలాగే, తమ ఇండ్లకు దగ్గరగా  సరైన రవాణా సౌకర్యాలు, పాఠశాలలు, ఆస్పత్రులు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని  వాపోతున్నారు.

ఇప్పటివరకు 40 వేల ఇండ్లు కేటాయింపు..

జీహెచ్‌‌ఎంసీ పరిధిలో మొత్తం లక్ష ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 2023 డిసెంబర్ నాటికి 70 వేల ఇండ్లు పూర్తి కాగా.. సుమారు 40 వేల ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించారు. వీరిలోనూ 14 వేల మంది ఇండ్లలో ఉండడం లేదు. ఏండ్లు గడుస్తున్నా.. ప్రభుత్వం కేటాయించిన ఇండ్లలో ఉండకపోవడం వల్లే ఆయా లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చినట్టు రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. నోటీసులు ఇచ్చిన వారిలో 5 వేల మందే ఇప్పటివరకు స్పందించారని, మిగిలిన వారు ఎలాంటి రిప్లై ఇస్తారో చూస్తామని అంటున్నారు. 

కొన్నిచోట్ల అరకొర సౌలతులు..

నాంపల్లి, పాతబస్తీతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని పేదలకు కొల్లూరులో డబుల్ బెడ్‌‌రూమ్ ఇండ్లను కేటాయించారు. ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కొల్లూరులో నివాసం ఉండటంతో అక్కడ స్కూల్, ఆస్పత్రి, అంబులెన్స్ తదితర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. కొల్లూరుతో పాటు రాంపల్లి (ఈసీఐఎల్), కుత్బుల్లాపూర్, మహేశ్వరం, పోచారం లాంటి ప్రాంతాల్లో 5 వేల ఫ్లాట్లు ఉండగా, వీటిలో చాలా వరకు మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదు. తాగునీరు, డ్రైనేజీ సమస్యలతో పాటు స్కూళ్లు, ఆస్పత్రులు అందుబాటులో లేకపోవడంతో మూడేండ్లుగా ఖాళీగా ఉంటున్నాయి. అనేక చోట్ల డోర్లు, కిటికీలు మాయమైనట్టు ఫిర్యాదులు వచ్చాయి.

10 కిలో మీటర్ల దూరంలో సర్దుబాటు

గత ప్రభుత్వ హయాంలో డబుల్​బెడ్‌‌రూమ్ ఇండ్ల కేటాయింపులో అధికారులు, ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇక్కడి వారికి అక్కడ, అక్కడి వారికి ఇక్కడ ఇండ్లు కేటాయించడంతో దూరభారం వల్ల లబ్ధిదారులు ఉండలేని పరిస్థితి వచ్చింది. తాజాగా లబ్ధిదారుల అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వం వీరిని 10 కిలో మీటర్ల పరిధిలోని డబుల్​బెడ్‌‌రూమ్ ఇండ్ల కాలనీల్లో సర్దుబాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు 14 వేల మంది నుంచి సమాధానం వచ్చాక లిస్టు తయారుచేసి సర్దుబాటుకు చర్యలు తీసుకునే వీలుందని ఓ అధికారి ‘వెలుగు’కు వివరించారు. ప్రభుత్వం తీసుకోబోయే ‘10 కిలో మీటర్ల పరిధి’ నిర్ణయం అమలైతే వేలాది కుటుంబాలకు ఊరట లభించే అవకాశం ఉంది.