హార్మూజ్ ఇక ఇప్పట్లో ఓపెన్ కాదేమో..! యూఎన్‎లో బహ్రెయిన్ తీర్మానాన్ని అడ్డుకున్న రష్యా, చైనా

హార్మూజ్ ఇక ఇప్పట్లో ఓపెన్ కాదేమో..! యూఎన్‎లో బహ్రెయిన్ తీర్మానాన్ని అడ్డుకున్న రష్యా, చైనా

వాషింగ్టన్: ప్రపంచ ముడి చమురు రవాణాకు గుండె కాయలాంటి స్ట్రైయిట్ ఆఫ్ హార్మూజ్ జలసంధిని ఐక్యరాజ్య సమితి ద్వారా తిరిగి తెరిపించే ప్రక్రియకు బ్రేక్ పడింది. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (UNSC) బహ్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా, చైనా తమకు ఉన్న ప్రత్యేకమైన వీటో పవర్ ద్వారా అడ్డుకున్నాయి.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రస్తుతం 5 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. అవి అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్. ఈ దేశాలు భద్రతా మండలి తీసుకునే ఏ నిర్ణయాన్నైనా, ఏ తీర్మానాన్నైనా ఒంటరిగా నిరోధించగలవు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ మూసివేసిన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలంటూ బహ్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా, చైనా తమకున్న ప్రత్యేకమైన వీటో పవర్ ఉపయోగించే తీర్మానాన్ని అడ్డుకున్నాయి.

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ అష్టదిగ్భంధనం చేసింది. హార్మూజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేయడంతో గల్ఫ్ దేశాల నుంచి చమురు రవాణా నిలిచిపోయి ప్రపంచ దేశాల్లో ఇంధన సంక్షోభం తల్తెంది. దీంతో హార్మూజ్ జలసంధిని తిరిగి ఓపెన్ చేయాలని ఇరాన్ పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. 

2026, ఏప్రిల్ 7వ తేదీలోపు హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని లేదంటే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ట్రంప్ డెడ్ లైన్ విధించారు. కానీ ఇరాన్ తమ షరతులకు అమెరికా అంగీకరిస్తేనే హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తామని పట్టుబట్టింది. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి ద్వారా ఇరాన్ పై ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో యూఎన్ లో బహ్రెయిన్ తీర్మానం ప్రవేశపెట్టింది. కానీ ఇరాన్ మిత్రదేశాలు చైనా, రష్యా బహ్రెయిన్ తీర్మానాన్ని వీటో పవర్ ద్వారా అడ్డుకున్నాయి.