- శుభాంకర్ సంచలనం
- ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల తొలిరౌండ్‌లో ఐదోసీడ్ సింధు 21–15, 21–13తో మిచెల్లీ లీ (కెనడా)పై సునాయాసంగా విజయం సాధించింది. కేవలం 44 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తెలుగు స్టార్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చింది. ముఖాముఖి పోరులో 5–2తో ఈ పోరును ఆరంభించిన సింధు.. బలమైన ర్యాలీలు, షాట్లతో తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్‌లో వర్థమాన ప్లేయర్ శుభాంకర్ డే సంచలనం నమోదు చేశాడు. వరల్డ్ నం. 42 శుభాంకర్ 15–21, 21–14, 21–17తో వరల్ నం.17 టామీ సుగియార్టో (ఇండోనేసియా)పై పోరాడి విజయం సాధించాడు. గంటా 18 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా ప్లేయర్ కీలక దశలో వరుసగా పాయింట్లు సాధించి సత్తాచాటాడు.
కెరీర్ బెస్ట్‌కు సాయిప్రణీత్
బీడబ్ల్యూఎఫ్ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో బీ సాయిప్రణీత్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఒకస్థానం మెరుగుపర్చుకుని 11వ ర్యాంకులో నిలిచాడు. కిడాంబి శ్రీకాంత్ ఒక్కస్థానం కోల్పోయి పదో ర్యాంకుకు పడిపోయాడు. సమీర్ వర్మ 18వ ర్యాంకులో నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఆరో ర్యాంకులోనే కొనసాగుతోంది. సైనా నెహ్వాల్ ఒకస్థానం కోల్పోయి తొమ్మిదో ర్యాంకుకు పడిపోయింది.


