రాష్ట్రంలో వైద్యానికి భారీగా కేంద్రం నిధులు

రాష్ట్రంలో వైద్యానికి భారీగా కేంద్రం నిధులు
  • రూ.750 కోట్లతో ఐదేండ్లలో వెయ్యికి పైగా అర్బన్ హెల్త్ అండ్ వెల్​నెస్​ సెంటర్లు
  • హెల్త్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​కు మరో రూ.1000 కోట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజారోగ్యం కోసం గ్రాంట్ల రూపంలో 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి భారీగా నిధులు రానున్నాయి. ఒక్క అర్బన్ హెల్త్ అండ్ వెల్​నెస్ లకే రానున్న ఐదేండ్లలో రూ.750 కోట్లు ఇవ్వనుంది. 2022–23లో హెల్త్​ గ్రాంట్ రూ.419 కోట్లు ఉండగా, ఇందులో రూ.133 కోట్లు అర్బన్ హెల్త్ సెంటర్లకు (హెచ్​సీడబ్ల్యూ) ఇచ్చేలా ప్రపోజల్స్ కు ఆమోదం లభించినట్లు తెలిసింది.. ప్రధానంగా స్లమ్ ఏరియాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ఫైనాన్స్ కమిషన్​ సూచించింది. అర్బన్ హెల్త్ అండ్ వెల్​నెస్ సెంటర్లతో పాటు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లలో డయాగ్నోస్టిక్ ఇన్​ఫ్రాస్ర్టక్చర్​ ఫెసిలిటిస్ కోసం కూడా ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు వినియోగిస్తున్నారు. అయితే వీటిని టీ డయాగ్నోస్టిక్స్​కు మళ్లీస్తున్నారు. ఈసారి రూ.50 కోట్లు గ్రాంట్ వచ్చింది. అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లకు వస్తున్న నిధులను బస్తీ దవాఖానాలకు రాష్ట్ర సర్కార్ ఖర్చు చేస్తోంది. ఇవి కాకుండా ప్రధానమంత్రి ఆయుష్మాన్​భారత్ హెల్త్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద వచ్చే ఐదేండ్లలో ఇంకో వెయ్యి కోట్ల రూపాయలు రానున్నాయి.  

దశల వారీగా ఏర్పాటు..

దశలవారీగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 11,024 అర్బన్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా ఉంది. ఫైనాన్స్ కమిషన్ ప్రకారం కొత్తగా ఒక మెడికల్ ఆఫీసర్​ను నియమించుకోవడం, స్టాఫ్ నర్స్, ఒక ఎంపీడబ్ల్యు, గార్డు, క్లీనింగ్ స్టాఫ్ మొత్తం ఐదుగురితో అర్బన్ హెల్త్ అండ్ వెల్​నెస్ సెంటర్ నడిపించాల్సి ఉంటుంది. ఒక్కో నాన్ మెట్రో పట్టణాల్లో హెచ్​సీడబ్ల్యూ కోసం ఫైనాన్స్ కమిషన్ రూ.75 లక్షలు ఇస్తున్నది. ఇక మెట్రో పట్టణాల్లో (జీహెచ్​ఎంసీ) రూ.27 లక్షలు ఖర్చు చేయనున్నారు. జీహెచ్​ఎంసీలో 93, రంగారెడ్డి జిల్లాలో 22, మంచిర్యాల్​జిల్లాలో తొమ్మిది, నిజామాబాద్, నల్గొండలలో ఎనిమిది, జగిత్యాల, మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లాల్లో ఏడు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో ఆరు, మహబూబ్​నగర్, కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాల్లో ఐదు, కామారెడ్డి, హన్మకొండ, నాగర్​కర్నూల్, వికారాబాద్​జిల్లాల్లో నాలుగు చొప్పున, జోగులాంబ గద్వాల్, ఆదిలాబాద్, నిర్మల్, యదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మూడు, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, ఆసిఫాబాద్​కుమ్రం భీమ్, మహూబాబాద్, వనపర్తి జిల్లాల్లో రెండు, వరంగల్ రూరల్, నిర్మల్, నారాయణపేట జిల్లాల్లో ఒకటి చొప్పున హెచ్​సీడబ్ల్యు (బస్తీ దవాఖానాలు) ఏర్పాటు చేయనున్నారు.

రాష్ట్రంలో వెయ్యికిపైగా..

ఫైనాన్స్ కమిషన్ నిధులతో ఏటా కొన్ని చొప్పున మొత్తం వెయ్యికి పైగా హెచ్​సీడబ్ల్యూ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో గత ఆర్థిక సంవత్సరం 237 మంజూరు కాగా... ఈ సారి178, 2023–24లో 187, 2024–25లో 196, 2025–26లో 206 సెంటర్లు ఏర్పాటు కానున్నాయి.