- వెదర్ చేంజ్‌తో జ్వరాలు వస్తున్నయ్..
- గాంధీ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్‌కుమార్
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, ప్రొఫెసర్ సునీల్‌కుమార్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణం, వర్షాల కారణంగా ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ల ప్రభావం పెరిగిందన్నారు.
అస్తమా, క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధులు, కరోనా తరహా లక్షణాలతో వచ్చే రోగులకు వైద్యుల పర్యవేక్షణలో ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి ఓపీలో సుమారు వెయ్యి కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో ఒక్కరికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు.
- కరోనా వచ్చినా ఎదుర్కొంటాం..
ఏపీలో వ్యాప్తిలో ఉన్నది ఒమిక్రాన్ వేరియంట్‌గా గుర్తించినప్పటికీ, తెలంగాణలో ఇప్పటివరకు జీనోమ్ సీక్వెన్సింగ్ అవసరం రాలేదన్నారు. గాంధీ ఆస్పత్రి జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్ ఓపీలకు ప్రతిరోజూ సుమారు 500 మంది రోగులు వస్తుండగా, వారిలో దాదాపు 50 మంది జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలతో వస్తున్నారని తెలిపారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారికి ర్యాపిడ్ ఆంటిజెన్, అవసరమైతే ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ సీజన్‌లో గాంధీ ఆస్పత్రిలో కరోనా కారణంగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. కరోనా ఇప్పుడు సాధారణ జ్వరంలాంటిదేనని, భయపడకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. భవిష్యత్తులో కేసులు పెరిగినా ఎదుర్కొనేందుకు గాంధీ ఆస్పత్రి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని, అవసరమైన మందులు, బెడ్లు, ఆధునిక వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్య బృందం అందుబాటులో ఉన్నాయని సునీల్‌కుమార్ తెలిపారు.
