- సింగిల్ యూజ్ ప్లాస్టిక్వాడొద్దని విన్నపం
- డీజేలు పెట్టి సౌండ్పొల్యూషన్ చేయొద్దన్న మినిస్టర్
- మండపాలకు ఉచిత విద్యుత్ వాడుకోవాలని రిక్వెస్ట్
- గణేశ్ ఉత్సవాలపై ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్ సిటీ, వెలుగు : నగర ప్రజలు పర్యావరణహితంగా ఆలోచించి మట్టి విగ్రహాలు పెట్టడానికే ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్అధికారులకు సూచించారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగించవద్దని నిర్వాహకులు, భక్తులకు విజ్ఞప్తి చేశారు. డీజేలు వాడొద్దని ఉన్న ఆదేశాలను పాటించాలని కోరారు. మరికొద్ది రోజుల్లో గణేశ్ఉత్సవాలు మొదలుకానున్న నేపథ్యంలో మంగళవారం ఏర్పాట్లపై జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోందని, నిర్వాహకులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
రౌండ్ ది క్లాక్ పనిచేయాలి..
మూడు కార్పొరేషన్లలో నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో 24 గంటల పాటు పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, రోడ్డు రిపేర్లు పూర్తి చేయాలని, స్ర్టీట్ లైట్లు సక్రమంగా వెలిగేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఫాగింగ్, బయో టాయిలెట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఉత్సవాల్లో కొత్తగా ప్రారంభించిన మున్సిపల్ కార్పొరేషన్ల లోగోలను విస్తృతంగా ప్రదర్శించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.
లా అండ్ఆర్డర్, ట్రాఫిక్ ఏర్పాట్ల విషయంలో పోలీసులు అలర్ట్ గా ఉండాలని, షీ టీమ్స్, యాంటీ-థెఫ్ట్ టీమ్స్నిరంతరం నిఘా పెట్టేలా చూడాలన్నారు. నిమజ్జనం సందర్భంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 24 గంటల పాటు హెల్త్‌క్యాంపులు నిర్వహించాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం కరెంట్ఉండేలా చూసుకోవాలన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లు, స్విమ్మర్లను సిద్ధంగా ఉంచాలన్నారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో అవసరమైన ప్రాంతాల్లో లైఫ్‌బోట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. బేబీ పాండ్లలో పూడికను వాటర్ బోర్డు అధికారులు తొలగించాలని, అలాగే నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు చెక్ చేయాలన్నారు.
700 స్పెషల్ బస్సులు
భక్తుల రద్దీకి అనుగుణంగా 700 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని మంత్రి పొన్నం ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా బస్సులు బ్రేక్ డౌన్ అయితే మొబైల్ బ్రేక్‌డౌన్ రిలీఫ్ వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. మెట్రో రైల్ సేవలను అవసరానికి అనుగుణంగా పొడిగించాలని, రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచాలని, ప్రయాణికులకు ముందస్తు సమాచారం అందించాలని ఆదేశించారు.
ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, డీజీపీ సీవీ ఆనంద్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సీఎంసీ కమిషనర్ సృజన, ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అలా, రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎండోమెంట్స్ కమిషనర్ హనుమంతరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మర్రి రాజశేఖర్ రెడ్డి, అడిషనల్ డీజీ మహేష్ భగవత్, పోలీస్ కమిషనర్లు సజ్జనార్, రమేశ్, సుమతి, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయెల్ డేవిస్ పాల్గొన్నారు.
