- రెండేండ్ల నుంచి చాన్స్ఇచ్చినా నో రెస్పాన్స్
- ఇప్పటివరకు చేసుకున్నది 70 శాతమే
- ఏ క్షణమైనా నిలిపివేస్తామంటున్న కంపెనీలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: అర్హులైన గ్యాస్ వినియోగదారులను గుర్తించడంతో పాటు అర్హత లేని వారిని తొలగించేందుకు చేపట్టిన ఈ కేవైసీకి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో కంపెనీలు త్వరలోనే నిలిపివేసేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఈ కేవైసీ చేసుకోని వారికి గ్యాస్ సరఫరా ఆగిపోయే అవకాశం ఉంటుందని డీలర్స్ అంటున్నారు.
ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 30 లక్షల కనెక్షన్లుండగా 70 శాతం మంది వినియోగదారులు మాత్రమే ఈ కేవైసీ చేసుకున్నారు. అయితే, డిమాండ్‌కు సరిపడా గ్యాస్ సరఫరా కాకపోవడంతో కొన్ని కంపెనీలు ఈ కేవైసీ సాకుతో సిలిండర్ల డెలివరీ నిలిపివేసే చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
గడువు ఇచ్చినా నిర్లక్ష్యం
2024 జూన్‌లో వినియోగదారులు ఈ కేవైసీ చేసుకోవాలని ఆయిల్‌కంపెనీలు ప్రకటించాయి. ముందుగా ఏడాది సమయం ఇచ్చారు. తర్వాత నిరంతర ప్రక్రియ పేరుతో కొనసాగిస్తున్నారు. అయినా వినియోగదారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని అధికారులు అంటున్నారు.
2014లోనూ ఈకేవైసీ మొదలుపెట్టి ఐదేండ్ల పాటు కొనసాగించారు. ఈసారి మాత్రం రెండేండ్లకే ముగించేలా సిద్ధమవుతున్నారు. దీనికి గ్యాస్సరఫరాలో కొరత కారణంగా తెలుస్తున్నది.
అలాగే, గ్రేటర్ పరిధిలో టిఫిన్ సెంటర్లు, చిన్న చిన్నహోటళ్లు, స్ట్రీట్ వెండర్లు ఇలా చాలామంది కమర్షియల్ గ్యాస్ వినియోగించకుండా డొమెస్టిక్ సిలిండర్లను వాడుతున్నారు. దీంతో ఈ కేవైసీ ద్వారా కట్టడి చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ కేవైసీ చాలా సులభంగా చేసుకునే అవకాశం ఉందని, ఆయా కంపెనీల యాప్ ల ద్వారా కానీ, డీలర్స్ వద్దకు వెళ్లి కానీ, డెలివరీ బాయ్స్ వచ్చినప్పుడు వారి ఫోన్లలో ఉండే యాప్‌ద్వారా చేసుకోవచ్చంటున్నారు.
