gb whatsappతో వల.. జరభద్రం అంటున్న నిపుణులు

gb whatsappతో  వల.. జరభద్రం అంటున్న నిపుణులు

వాట్సప్.. అందరికీ సుపరిచితమైన మెసేజింగ్ యాప్!!  ఇప్పుడు మరొక వాట్సప్ పేరు వినిపిస్తోంది. అదే ‘జీబీ వాట్సప్’ !! అదరగొట్టే అడ్వాన్స్ డ్ ఫీచర్లతో ఇది యూత్ ను ఫిదా చేస్తోంది. తళుక్కుమనే ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. అయితే ఈ తళుకుల వెనుక ఒక చీకటి కోణం దాగి ఉంది. అదేమిటంటే.. ఇదొక ‘థర్డ్ పార్టీ’ మొబైల్ యాప్. ఈవిషయం తెలిసినా విచ్చలవిడిగా జీబీ వాట్సప్ డౌన్ లోడ్లు జరుగుతున్నాయి. ఒకరిని చూసి ఇంకొకరు క్యూ కట్టి దీన్ని డౌన్ లోడ్ చూసుకుంటున్నారు.  డాటా సెక్యూరిటీ రిస్క్ ఉందని తెలిసినా జంకడం లేదు. హాట్ టాపిక్ గా మారిన జీబీ వాట్సప్ పై కథనమిది. 
 
జీబీ వాట్సప్ లో సమాచార చోరీ.. 

సిసలైన వాట్సప్ తో పోలిస్తే జీబీ వాట్సప్ లో ఫీచర్లు పెద్దసంఖ్యలో ఉంటాయి. అయితే అంతే రేంజ్ లో రిస్క్ ను కూడా యూజర్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే జీబీ వాట్సప్ లో మెసేజ్ ఎన్క్రిప్షన్ జరగదు. ఫలితంగా మనం ఇతరులకు పంపే మెసేజ్ లు, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్ల లీకేజీ జరిగే అవకాశాలు పెరుగుతాయి. ఈ సున్నితమైన సమాచారం సంఘ విద్రోహ శక్తులు, హ్యాకర్ల చేతిలో పడితే ఇక అంతే సంగతులు.

సాధారణంగా మనం ఏదైనా మెసేజ్ పంపితే వాట్సప్ సర్వర్ లోని ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్) ని తాకిన వెంటనే  గమ్య స్థానానికి (మరో వాట్సప్ నంబరుకు)  డెలివరీ అవుతుంది. కానీ జీబీ వాట్సప్ లో మనం పంపే మెసేజ్ కు సంబంధించిన ఏపీఐ మొదట ‘జీబీ వాట్సప్’ ఏపీకే సర్వర్ కు చేరి.. అక్కడి నుంచి అఫీషియల్ వాట్సప్ సర్వర్ కు చేరుతుంది. అంటే మనం పంపే మెసేజ్ లు మధ్యలో గుర్తు తెలియని ఒకచోట ఆగుతున్నాయన్న మాట. ఇలా మెసేజ్ లు తమ సర్వర్ లో ఆగే క్రమంలో వాటి రికార్డింగ్, కాపీయింగ్ కు జీబీ వాట్సప్ నిర్వాహకులు పాల్పడే ముప్పు పొంచి ఉంది.

పత్తాలేని యాప్

జీబీ వాట్సప్ ఒక పత్తాలేని యాప్. దీనివల్ల ఏదైనా నష్టం జరిగినా సంప్రదించే చిరునామా ఉండదనే విషయాన్ని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. అఫీషియల్ వాట్సప్ లోనైతే దేనిపైనైనా ఫిర్యాదు చేసేందుకు ఒక యంత్రాంగం ఉంటుంది. కాబట్టి అందులో మనం జరిపే చాటింగ్ కు, పంపే మెసేజ్ లకు భద్రత లభిస్తుంది. ఈనేపథ్యంలో ఫీచర్ల కోసం మోజు పడి ‘జీబీ వాట్సప్’ ఏపీకే ఫైల్ ను ఇన్ స్టాల్ చేసుకొని వాడొద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఫోన్ లోని సున్నితమైన సమాచారం చోరీకి గురయ్యే అవకాశాలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. 

ఈఎస్ఈటీ వార్నింగ్ 

ఒమర్ అనే ఒక అరేబియన్ యాప్ డెవలపర్ జీబీ వాట్సప్ ను తయారుచేశాడు. వాట్సప్ ఏపీఐ ను తాత్కాలికంగా డైవర్ట్ చేసే కోడింగ్ తో దీన్ని రూపొందించాడు. దీనికి కొత్త కొత్త ఫీచర్లను యాడ్ చేసి  జీబీ వాట్సప్ ఏపీకే ఫైల్ ను..  పలు వెబ్ సైట్లలో అప్ లోడ్ చేశాడు. అక్కడి నుంచి దీన్ని నెటిజన్స్ డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. కేవలం ఆకట్టుకునే ఫీచర్ల మోజులో దీని డౌన్ లోడ్స్ జరుగుతున్నాయి. ఫలితంగా మన మెసేజింగ్ పై మూడో వ్యక్తి (థర్డ్ పార్టీ) కన్ను వేసేందుకు అవకాశం కలుగుతోంది. ఈనేపథ్యంలో ‘జీబీ వాట్సప్‌’ అనే వాట్సప్‌ క్లోన్‌ యాప్‌ మనదేశంలోని వాడకందార్లపై గూఢచర్యం చేస్తున్నట్టు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘ఈఎస్‌ఈటీ’ ఇటీవల  ఓ నివేదికను విడుదల చేసింది. ఇలాంటి అన్‌ సపోర్టెడ్‌ యాప్‌లను వాడేవారి ఖాతాలపైనా వాట్సప్‌ తాత్కాలికంగా నిషేధం విధించింది. క్లోన్‌ వాట్సప్‌ కేసులు ఎక్కువగా మనదేశంతో పాటు ఈజిప్టు, బ్రెజిల్‌, పెరూలలో వెలుగు చూస్తున్నాయి. 

 ఈ ఫీచర్లతో  వల.. 

  • వాయిస్ ఛేంజింగ్ : అఫీషియల్ వాట్సప్ లో వాయిస్ రికార్డింగ్ నార్మల్ గా జరుగుతుంది. కానీ జీబీ వాట్సప్ లో వాయిస్ ను రికార్డ్ చేసే క్రమంలోనే.. దానికి వివిధ ఆడియో ఎఫెక్ట్స్ ను యాడ్ చేసే వెసులుబాటు ఉంటుంది. సరదాగా ఫ్రెండ్స్ తో ఇలాంటి రికార్డెడ్ వాయిస్ లను షేర్ చేసుకోవచ్చు.
  • ఎనీటైం డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ :  అఫీషియల్ వాట్సప్ లో ఏదైనా మెసేజ్ ను ఇతరులకు పంపినప్పుడు కొంతసేపటి తర్వాత ‘డిలీట్ ఫర్ ఎవ్రీ వన్’ అనే ఆప్షన్ ఉండదు. కానీ జీబీ వాట్సప్ లో మీరు మెసేజ్ పంపిన ఎంతసేపటి తర్వాతైనా  ‘డిలీట్ ఫర్ ఎవ్రీ వన్’ చేయొచ్చు. ఆ ఆప్షన్ ను ఏం టైంలో అయినా వాడుకోవచ్చు.
  • లొకేషన్ ట్రాకర్ : ఎవరికైనా మనం లొకేషన్ ను పంపితేనే వాళ్లు ట్రాక్  చేయగలుగుతారు. కానీ జీబీ వాట్సప్ వాడే వాళ్లు ఇతరుల లొకేషన్ ను నేరుగా ట్రాక్ చేయగలుగుతారు. వాస్తవానికి దీనివల్ల ఇతర వినియోగదారుల సెక్యూరిటీకి విఘాతం కలుగుతుంది. 
  • మెసేజ్ డిలీట్ అయినా కనిపిస్తుంది : సాధారణ వాట్సప్ లో ఎవరైనా మనకు పొరపాటున ఒక మెసేజ్ ను పంపి, వెంటనే దాన్ని డిలీట్ చేస్తే చూడలేం. ఇంతకీ డిలీట్  చేసిన ఆ మెసేజ్ ఏమిటబ్బా అని ఆలోచిస్తుంటాం. కానీ జీబీ వాట్సప్ లో అలా ఇతరులు పంపి, వెంటనే డిలీట్ చేసిన మెసేజ్ లు కూడా కనిపిస్తాయి. 
  • మెసేజ్ షెడ్యూలింగ్ : జీబీ వాట్సప్ లో మనం మెసేజ్ ను షెడ్యూల్ చేయొచ్చు. ఏ టైం కోసం.. ఎవరి కోసం మనం మెసేజ్ ను షెడ్యూల్ చేస్తామో.. ఆ టైం కాగానే వారికి వెళ్లిపోతుంది. 
  • హైడ్ బ్లూటిక్, హైడ్ వ్యూ స్టేటస్, హైడ్ ఆన్ లైన్ స్టేటస్ : ఇతరుల నుంచి వచ్చిన మెసేజ్ లను మనం చదవగానే.. అవతలి నుంచి పంపిన వాళ్ల ఫోన్లలో బ్లూటిక్ వస్తుంది. జీబీ వాట్సప్ లో హైడ్ బ్లూటిక్ అనే ఆప్షన్ ను ఎనబుల్ చేసుకుంటే.. వచ్చిన మెసేజ్ లు చదివినా అవతలి వాళ్లకు బ్లూటిక్ రాదు. ఇదే విధంగా మన వాట్సప్ స్టేటస్ ను, ఆన్ లైన్ స్టేటస్ ను కూడా చూపించకుండా దాచేలా ప్రైవసీ సెట్టింగ్స్ ఇందులో ఉన్నాయి. ఇక ఎవరి వాట్సప్ స్టేటస్ అయినా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
  • జీబీ వాట్సప్ లో దాదాపు 700 థీమ్ లు ఉన్నాయి. నచ్చిన థీమ్ ఎంపిక చేసుకోవచ్చు.
  • జీబీ వాట్సప్ లోని చాట్ సెక్షన్ లో ఇతరుల ఫోన్ నంబరు పక్కనే.. వాళ్లు ఆన్ లైన్లో ఉన్నారో.. లేదో తెలిపే సింబల్స్ ఉంటాయి. దీనివల్ల వాళ్ల నంబరును క్లిక్ చేయకుండానే ఆన్ లైన్ స్టేటస్ పై క్లారిటీకి వచ్చేయొచ్చు.
  • జీబీ వాట్సప్ లో వైఫై  సింబల్ తో ‘డునాట్ డిస్టర్బ్’ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఆన్ చేస్తే ఏ మెసేజ్ రాదు. పోదు.
  • జీబీ వాట్సప్ లో ఏకకాలంలో 90 ఫొటోలను, 100 ఎంబీ ఆడియో ఫైల్స్ ను ఏకకాలంలో సెండ్ చేయొచ్చు.