- ఫార్మసీ పూర్తి చేసిన వాళ్లకు చాన్స్
- రాష్ట్ర వ్యాప్తంగా 300 ఫార్మసీల ఏర్పాటుకు కసరత్తు
- ప్రైవేట్ మెడికల్ షాపుల దందాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యం
- తమిళనాడులోని సీఎం ఫార్మసీ తరహాలో సరికొత్త పాలసీ
- షాపుల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు
- త్వరలోనే నిర్ణయం తీసుకోనున్న వైద్య ఆరోగ్యశాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు జనరిక్ మెడికల్ షాపులను మహిళా సంఘాలు, ఎన్జీవోలకు కేటాయించేవారు. అయితే, ఆ పాత పద్ధతికి స్వస్తి పలికి, ఫార్మసీ చదువు పూర్తి చేసిన అర్హత గల నిరుద్యోగ యువతకే ఈ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ప్రస్తుతం ప్రభుత్వ ఇన్ హౌజ్ ఫార్మసీల్లో కేవలం 640 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.
డాక్టర్లు రాసే స్పెషలిస్ట్ మందులు అక్కడ లేకపోవడంతో రోగులు అనివార్యంగా బయటి షాపుల దోపిడీకి గురవుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 300లకు పైగా కొత్త జనరిక్ మెడికల్ స్టోర్స్ ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి దొరకడంతో పాటు... నాణ్యమైన మందులు తక్కువ ధరకే లభిస్తాయని ప్రభుత్వం భావిస్తున్నది.
- ప్రైవేట్ షాపుల దోపిడీకి చెక్..
సర్కార్ దవాఖానల ఆవరణలో ఇకపై మూడు రకాల ఫార్మసీలు మాత్రమే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఒకటి ప్రభుత్వ ఉచిత ఇన్ – -హౌస్ ఫార్మసీ, రెండవది నిరుద్యోగులు నడిపే స్టేట్ జనరిక్ స్టోర్, మూడవది కేంద్ర ప్రభుత్వ అమృత్ ఫార్మసీ. బయట వంద రూపాయలు పలికే మందు ఈ జనరిక్ స్టోర్లలో కేవలం రూ. 10 నుంచి రూ. 20 కే లభించే అవకాశం ఉండటంతో, రోగులకు ఆర్థిక భారం తగ్గనుంది. ముఖ్యంగా క్యాన్సర్, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలకు సంబంధించిన ఖరీదైన మందులను కూడా ఈ జనరిక్ ఫార్మసీల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అటు నిరుద్యోగ ఫార్మసిస్టులకు కొలువు దొరకడమే కాకుండా, లక్షలాది మంది పేద రోగులకు మందుల ఖర్చు మిగలనుంది.
- తమిళనాడు మోడల్లో...
తమిళనాడులో విజయవంతంగా నడుస్తున్న ‘ముదల్వర్ మురుందగం’ (ముఖ్యమంత్రి ఫార్మసీలు) విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో ఈ పాలసీని రూపొందిస్తున్నారు. నిరుద్యోగ ఫార్మసిస్టులకు ఉపాధి కల్పించడంతో పాటు, షాపుల కేటాయింపుల్లో సామాజిక న్యాయం జరిగేలా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఆరోగ్యశాఖ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. స్థలం కేటాయింపు నుంచి మందుల సరఫరా వరకు అంతా ప్రభుత్వం పర్యవేక్షణలోనే సాగనుంది.
నిరుద్యోగ యజమానులకు భారం కాకుండా నామమాత్రపు రెంట్ తోనే హాస్పిటల్ లో స్థలం కేటాయించనున్నారు. నిరుద్యోగులకు బ్యాంకు రుణాలు ఇప్పించడంలోనూ.. సహాయం చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ ఫార్మసీల ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.
- ఎంపిక చేసిన 300 కేంద్రాల్లో ..
ఇప్పటికే కొన్ని హాస్పిటల్స్ లో.. ఎన్జీవోలు, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీల ఆధ్వర్యంలో జనరిక్ మెడికల్ షాపులు నడుస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయబోయే జనరిక్ మెడికల్ షాపులను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీ ఎం ఈ ) పరిధిలోని అన్ని టీచింగ్ హాస్పిటల్స్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ ) పరిధిలోని జిల్లా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోని 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీలను కూడా ఈ ప్రాజెక్టులో చేర్చారు.
కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ లో ఒక జనరిక్ మెడికల్ షాప్ ఉండాలని ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అడుగులు వేస్తున్నది. అయితే, ఈ 300 వందల షాపుల్లో పైలెట్ ప్రాజెక్ట్ గా కొన్నింటిని.. ప్రారంభించి, ఆ తరువాత క్షేత్రస్థాయిలో అమలు పరచాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
