పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై గిగ్ వర్కర్ల నిరసన..5 గంటలపాటు నిలిచిన డెలివరీలు

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై గిగ్ వర్కర్ల నిరసన..5 గంటలపాటు నిలిచిన డెలివరీలు
  •  కమీషన్, ఫ్యూయెల్​ అలవెన్స్​ఇవ్వాలని డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా గిగ్ వర్కర్లు శనివారం నిరసన తెలిపారు. దీంతో స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో సేవలకు సంబంధించి పెద్ద ఎత్తున డెలివరీలు నిలిచిపోయాయి. ఫలితంగా నగరవాసులు, రెస్టారెంట్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  ఆన్‌‌ లైన్‌‌లో ఆర్డర్ పెట్టేందుకు ప్రయత్నించిన వినియోగదారులకు సర్వీస్ తాత్కాలికంగా అందుబాటులో లేదు అనే మెసేజ్‌‌లు కనిపించాయి. ఇంధన ధరలు పెరిగినా కంపెనీలు తమకు ఇచ్చే కమీషన్ లేదా చార్జీలను పెంచడం లేదని గిగ్​వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఉన్న కిలోమీటర్ రేటును పెరిగిన ధరలకు అనుగుణంగా సవరించాలని కోరారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన ప్రతిసారీ కంపెనీలే ఆ భారాన్ని మోస్తూ వర్కర్లకు ప్రత్యేకంగా ఫ్యూయల్ అలవెన్స్ ఇవ్వాలన్నారు. కంపెనీలు కిలోమీటర్ చొప్పున చార్జీలను పెంచాలని డిమాండ్​ చేశారు.

డిమాండ్లు నెరవేర్చాలి

పెట్రోల్, డీజిల్​ధరల పెంపు భారాన్ని వర్కర్లపైనే నెట్టేయడం అన్యాయమని గిగ్ వర్కర్ల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికైనా డెలివరీ క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు స్పందించి, తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో సమ్మెను ఉధృతం చేస్తామని, నిరవధిక బంద్‌‌కు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. శనివారం సాయంత్రం 5 గంటల తర్వాత సేవలు తిరిగి ప్రారంభమైనప్పటికీ, తమ సమస్యలను పరిష్కరించకపోతే మళ్లీ రోడ్డెక్కుతామని గిగ్ వర్కర్లు స్పష్టం చేశారు.