దేవుడు ఇచ్చిన చెల్లె సోలిపేట సుజాత

దేవుడు ఇచ్చిన చెల్లె సోలిపేట సుజాత

ఎన్నికల ముందు వచ్చి ఓట్లడిగే పార్టీలు కొన్ని అయితే.. ఎల్లప్పుడూ వెంటుండేది కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే నన్నారు మంత్రి హరీష్ రావు.  సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్యవైశ్య భవన్ లో మిరుదొడ్డి, దుబ్బాక ఆర్యవైశ్యుల అలాయ్, బలాయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు హరీష్ రావు. అవసరం అయితే అర్ధరాత్రి అయినా సుజాత అక్కకు అండగా ఉండి.. ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు. 70 ఏళ్లలో చేయని అభివృద్ధిని హుజూర్ నగర్ లో గెలిచాక 300 కోట్ల తో చేశామన్నారు. దుబ్బాక అభివృద్ధి బాధ్యత తనదేనన్న మంత్రి హరీష్.. సుజాత నాకు చెల్లె లాంటిదన్నారు. అంతేకాదు  హరీష్ రావు అంటే మాటల మనిషి కాదు.. చేతల మనిషిని అని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వైశ్య కార్పొరేషన్ స్కీం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అసాధ్యం అనుకున్న గోదావరి నీళ్లు తెచ్చి సుసాధ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు తేవడం వల్ల బోరు ఎండదు.. బావి దంగదన్నారు. నాకు అక్క చెల్లెలు లేకపోయిన.. దేవుడు ఇచ్చిన చెల్లె సోలిపేట సుజాత అని అన్నారు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలిచాక కేసీఆర్ ఏవిధంగా సహాయం చేశారో.. అంతకంటే ఎక్కువ ఇచ్చే విధంగా దుబ్బాక ప్రజల కృషి ఉండాలని కోరారు. ప్రతిపక్షాల మాటల్లో వాస్తవం లేదని ఆరోపించిన మంత్రి హరీష్ రావు.. అంతా బోగస్ ప్రచారమేనన్నారు.