రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ

రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
  • బిల్డింగ్ లు, లే అవుట్లు​, వెంచర్లకు త్వరగా ఇచ్చేందుకు అధికారుల  నిర్ణయం
  •  అప్లికేషన్ జారీలో ఊదాసీనత ఉండొద్దని ప్రభుత్వం ఆదేశాలు
  •  దరఖాస్తులు చేసుకున్న వెంటనే వెరిఫికేషన్​చేసి అనుమతులు
  •  ఆదాయం పెంచుకునేందుకు హెచ్ఎండీఏ అధికారుల చర్యలు 

హైదరాబాద్, వెలుగు :  బిల్డింగ్ లు, లే అవుట్లు, వెంచర్లకు పర్మిషన్ల జారీని మరింత సులభతరం చేయాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్​డెవలప్​మెంట్​అథారిటీ(హెచ్ఎండీఏ) నిర్ణయించింది. అప్లికేషన్ దారులు నెలల తరబడి వెయిట్ చేయకుండా స్పీడ్ గా వెరిఫికేషన్​, పర్మిషన్ ఇస్తూ.. తద్వారా సంస్థ ఇన్ కమ్ పెంచుకోవాలని అధికారులు సిద్ధమయ్యారు.  గ్రేటర్​సిటీ పరిధిలో రియల్​ఎస్టేట్ ఊపందుకోవడం, అందుకు తగ్గట్టుగా హెచ్ఎండీఏకు దరఖాస్తులు కూడా భారీగా వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా.. అనుమతులను వాయిదా వేశారు. తాగాజా అధికారులు పర్మిషన్లను వేగంగా జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.  ఇటీవల రియల్​ఎస్టేట్​పుంజుకోవడంతో  కొత్త వెంచర్లు, భవన నిర్మాణాల అనుమతులకు దరఖాస్తులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గతంలో జరిగిన పొరపాట్లకు తావివ్వకుండా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి 3 నెలల కాలంలోనే అధికంగా అనుమతులు మంజూరు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. 

పారదర్శకత ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశం

హై రైజ్ భవనాలు, లే అవుట్ల పర్మిషన్లలో అధికారులు పారదర్శకంగా ఉండాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఆదేశించారు. గత బీఆర్ఎస్​పాలనలో జరిగినట్టుగా అనుమతుల ఆలస్యం, మంజూరులో అవినీతి, అక్రమాలు చోటు చేసుకోకూడదని స్పష్టంచేశారు. రెరా అధికారి శివబాలాజీ అక్రమాలు బయట పడే వరకు కొందరు అధికారులు ఇలాగే అనుమతుల జారీకి డబ్బులు ఇస్తేనే పనులు చేశారనేది ప్రచారంలో ఉంది. కొందరు ఉన్నతాధికారులు కూడా ఆయనకు అనుకూలంగా వ్యవహరించారనేది కూడా తెలిసిందే. కాంగ్రెస్​అధికారంలోకి రాగానే  గతంలో ఇచ్చిన అనుమతులపై విచారణ జరిపేందుకు కొంతకాలంగా నిలిపివేసింది.  ఇటీవలే ప్రభుత్వ ఆదేశాలతో మళ్లీ అధికారులు అనుమతులు జారీ చేస్తుండగా వాటిలో పారదర్శకత పాటిస్తున్నారు.  

పెరిగిన దరఖాస్తులతో ఆదాయం

ప్రధానంగా శంషాబాద్, శంకర్​పల్లి జోన్ల పరిధిలో రియల్​బిజినెస్ జోరందుకుంది. మేడ్చల్, ఘట్​కేసర్​జోన్లలోనూ కొంత పెరుగుదల కనిపిస్తుంది. దీంతో మల్టీ లెవల్ బిల్డింగ్ లు, అపార్ట్​మెంట్లు, వెంచర్లకు హెచ్ఎండీఏకు అప్లికేషన్లు భారీగా వస్తున్నాయి. దీంతో అధికారులు వాటిని పరిశీలించి తగు అనుమతులు ఇస్తున్నారు. ఏప్రిల్ ఆఖరు నాటికి దాదాపు 1,450 వస్తే.. వెంటనే పర్మిషన్లు ఇచ్చినట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈఏడాది జనవరి నుంచి మార్చి నాటికి 3 నెలల్లో  లే అవుట్లకు, భవన నిర్మాణాలకు సంబంధించి మొత్తం 1,022 అప్లికేషన్లు వచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలాంటి అప్లికేషన్లు పెండింగ్​లో ఉంచడం లేదని, అందిన వెంటనే పరిశీలించి రూల్స్ ప్రకారం అనుమతులు మంజూరు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. కొంతకాలంగా హెచ్​ఎండీఏలో నెలకొన్న పరిస్థితులతో  పర్మిషన్లలో కొంతజాప్యం జరిగినది వాస్తవమేనని అధికారులు చెప్పారు. అయితే కొత్త దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. 

ఎన్​ఓసీ, ఓసీల జారీలోనూ..

భవన నిర్మాణాలు, అపార్ట్​మెంట్స్​వంటివి రూల్స్ ప్రకారమే నిర్మించేందుకు, కొంతస్థలాన్ని , ఫ్లాట్లను కానీ హెచ్ఎండీఏకు మార్టిగేజ్​చేస్తారు. అవి పూర్తయిన తర్వాత అధికారులు తనిఖీ చేసి వాటికి నో అబ్జెక్షన్​సర్టిఫికెట్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను జారీ చేస్తారు. వీటి జారీలోనే గతంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు పారదర్శకంగా ఉంటూ అధికారులు సర్టిఫికెట్​లను జారీ చేస్తున్నారు. 2023 ఆగస్టు నుంచి ఈ ఏడాది మార్చి నాటికి 215 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను జారీ చేశారు. మరో 99 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు మాస్టర్​ప్లాన్​కు అనుగుణంగా జోన్ల వారీగా కన్వర్షన్​లు ఉంటాయి. గత ప్రభుత్వం ల్యాండ్​కన్వర్షన్ అనుమతులు వివాదాస్పదం అయ్యాయి. వీటి ప్రక్రియలో అప్పటి అధికారి శివబాలకృష్ణ కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి.  ఇకముందు అలాంటి వివాదాలకు తావివ్వకుండా ల్యాండ్​కన్వర్షన్​అనుమతులు ఇవ్వాలని కూడా హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే దాదాపు 150 నుంచి 200 వరకు ల్యాండ్​కన్వర్షన్ కు దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నట్టు సమాచారం. ఎలాంటి వివాదాలకు తావులేకుండా, ఇబ్బందులు కలగకుండా కొత్తగా వచ్చే భూ మార్పిడి దరఖాస్తులకు త్వరలోనే అనుమతులు ఇవ్వడానికి అధికారులు రెడీ అవుతున్నారు.