భద్రాచలం వద్ద రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ

భద్రాచలం వద్ద రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ

భారీ వర్షాలతో రాష్ట్ర‌ వ్యాప్తంగా వరద పరిస్థితులు నెలకొన్నాయి. దానికి తోడు ఎగువన కురుస్తున్న వర్షాలు, పరీవాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రమాదకర స్థాయికి సమీపానికి చేరుకుంది. కేంద్ర జలమండలి (సీడబ్ల్యూసీ) అధికారులు గోదావరిలో నీటిమట్టం అంతకంతకు పెరుగుతుండడం పట్ల హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం రాత్రికల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుతుందని తెలిపారు.

నీటిపారుదల శాఖ అధికారులు భద్రాచలం వద్ద ఇప్పటికే రెండోసారి వరద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలంలో ఈ ఉదయానికి 48.1 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం మధ్యాహ్నానికి 52 అడుగులకు చేరింది. నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో వరద హెచ్చరిక జారీ చేస్తారు. కేంద్ర జలమండలి వద్ద ఉన్న రికార్డుల ప్రకారం 1986లో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 56.6 అడుగులకు చేరింది.