బంగారం భారతీయులకు జస్ట్ ఆభరణమే కాదు కష్టకాలంలో ఆదుకునే లక్ష్మీదేవి. ఇప్పుడు ఇదే నమ్మకం దేశవ్యాప్తంగా ఒక సరికొత్త రికార్డుకు కారణమైంది. భారత్‌లో గోల్డ్ లోన్స్ బిజినెస్ ఊహించని రేంజ్‌లో దూసుకుపోతోంది. మార్చి 2020లో దేశవ్యాప్తంగా రూ.2లక్షల 63వేల కోట్లుగా ఉన్న మొత్తం గోల్డ్ లోన్స్ విలువ.. మార్చి 2026 నాటికి ఏకంగా ఏడింతలు పెరిగి రూ.18లక్షల 63వేల కోట్లకు చేరింది. ప్రస్తుతం హౌసింగ్ లోన్స్ తర్వాత దేశంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న రెండో అతిపెద్ద రీటైల్ క్రెడిట్ సెగ్మెంట్‌గా గోల్డ్ లోన్ నిలిచింది.
ఒకప్పుడు గోల్డ్ లోన్స్ అనగానే కేవలం సౌత్ ఇండియా మాత్రమే గుర్తొచ్చేది. ఇప్పటికీ దేశంలోని మొత్తం గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలో మూడింతల వాటా దక్షిణాది రాష్ట్రాలదే. కరోనా మహమ్మారి తర్వాత ఈ ట్రెండ్ పూర్తిగా మారుతోంది. ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ గోల్డ్ లోన్స్ వృద్ధి నమ్మశక్యం కాని రీతిలో రికార్డులు సృష్టిస్తోంది.
క్రెడిట్ బ్యూరో డేటా ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్‌లో గోల్డ్ లోన్స్ గడిచిన ఆరేళ్లలో 28 రెట్లు పెరగ్గా, అసోంలో 17 రెట్లు, త్రిపురలో 13 రెట్లు పెరిగాయట. పెద్ద రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్.. బిహార్‌లలో 13 రెట్లు, రాజస్థాన్‌లో 11 రెట్లు లోన్స్ పెరిగాయి. కేవలం నంబర్ల పరంగా చూస్తే యూపీలో 2020లో రూ.3వేల 120 కోట్లుగా ఉన్న గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో.. 2026 నాటికి రూ.42వేల 344 కోట్లకు చేరింది. రాజస్థాన్‌లో రూ.41వేల 727 కోట్లకు, బిహార్‌లో రూ.11వేల 728 కోట్లకు ఈ మార్కెట్ విస్తరించింది.
ఈ మార్కెట్లో ఇప్పటికీ నంబర్ వన్ ప్లేస్ మాత్రం తమిళనాడుదే. దేశంలోని మొత్తం గోల్డ్ లోన్స్‌లో 32 శాతం వాటాతో రూ.5లక్షల 97వేల కోట్లు విలువైన గోల్డ్ లోన్స్ ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ 16.6 శాతం వాటాతో రెండో స్థానంలో ఉండగా, కర్ణాటక 9.8%, తెలంగాణ 8.6% వాటాతో ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే మిగతా రాష్ట్రాలు పుంజుకోవడంతో సౌత్ ఇండియా డామినేషన్ మెల్లగా తగ్గుతోంది. గతంలో 36.4 శాతంగా ఉన్న తమిళనాడు వాటా ఇప్పుడు 32 శాతానికి తగ్గింది. కేరళ వాటా కూడా 14.1 శాతం నుంచి 7.8 శాతానికి పడిపోయింది.
పర్సనల్ లోన్స్ కంటే తక్కువ వడ్డీకి, సులభంగా లోన్ దొరుకుతుండటం.. పైగా మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్నంటుతుండటంతో కస్టమర్లకు ఎక్కువ లోన్ అమౌంట్ లభిస్తోంది గోల్డ్ లోన్స్ ద్వారా. ప్రస్తుతం రూ.2లక్షల 50వేల వరకు లోన్ తీసుకుంటే బంగారం విలువలో 85 శాతం వరకు అప్పు ఇచ్చేలా రూల్స్ మార్చటం కూడా దీనికి ప్రధాన కారణం. దేశంలో మొత్తం కన్జంప్షన్ లోన్స్‌లో గోల్డ్ లోన్స్ వాటా 2020లో కేవలం 5.4 శాతంగా ఉంటే.. ఇప్పుడది 15.7 శాతానికి పెరిగింది. ముఖ్యంగా తమిళనాడులో ప్రజలు తీసుకునే మొత్తం రుణాల్లో ఏకంగా 43.7% వాటా గోల్డ్ లోన్స్‌దే కావడం ఆసక్తికరం.
