పోలీస్​ నీడలో గోల్కొండ.. పాములన్నీ పట్టేశారు

పోలీస్​ నీడలో గోల్కొండ.. పాములన్నీ పట్టేశారు

పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధమవుతోంది. జెండా వందనానికి సీఎం కేసీఆర్ సహా వీఐపీలు హాజరుకానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కోట పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేంద్ర బలగాలు, ఆక్టోపస్ తో సహా1500  మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కోట చుట్టూ రెండు మౌంటెడ్, 350 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. కవాతు జరిగే ప్రాంతంలో మరో 50 కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తాన్ని కంట్రోల్ రూమ్, బషీర్‌బాగ్‌ సీపీ ఆఫీస్ లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో కనెక్ట్ చేశారు. కోటను చేరుకునే రోడ్లలో బాంబ్, డాగ్ స్క్వాడ్​తో తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే అక్కడున్న పాములను పట్టేశారు.

హైదరాబాద్,వెలుగు: పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్దమౌతోంది. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఇండిపెండెన్స్ డే రోజున గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరణ ఆనవాయితీగా వస్తోంది. జెండా వందనానికి సీఎం కేసీఆర్ సహా వీఐపీలు,స్టూడెంట్స్, వివిధ శాఖల అధికారులు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు ఆర్టికల్ 370 రద్దుతో ఐబీ దేశవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేయడంతో సిటీ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. కోట పరిసర ప్రాంతాలను ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకుని అక్కడ సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. కేంద్రబలగాలు,ఆక్టోపస్ తో సహా1,500  మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

కేంద్రబలగాలతో గస్తీ

గోల్కొండ కోట చుట్టూ350 సీసీ కెమెరాలతో పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. రెండు మౌంటెడ్ కెమెరాలతో కోట పరిసర ప్రాంతాలను నిఘా నీడలోకి తెచ్చారు. భద్రతా ఏర్పాట్లను సీపీ అంజనీకుమార్,వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గత 5 రోజులుగా గోల్కొండ కోటలో నిర్వహిస్తున్న పోలీస్ రిహార్సల్స్ మంగళవారంతో ముగుస్తాయి. ఆ తర్వాత కోటను పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. గ్రే హౌండ్స్,ఆక్టోపస్ బృందాలతో గస్తీ ముమ్మరం చేశారు. గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లోని హోటల్స్,లాడ్జీలను తనిఖీ చేశారు. కోట చుట్టూ ఏర్పాటు చేసిన 300 కమ్యూనిటీ,ట్రాఫిక్ సీసీ కెమెరాలతో పాటు జెండా ఆవిష్కరణ,పోలీస్ కవాతు జరిగే ప్రాంతంలో మరో 50 కెమెరాలను ఏర్పాటు చేశారు.

వెహికల్స్ దారి మళ్లింపు

ఇండిపెండెన్స్ డే వేడుకలకు వచ్చే వీఐపీలు, స్టూడెంట్స్, సాధారణ జనాలకు ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్‌‌ విధానంలో పాసులు జారీ చేశారు. దీంతో పాటు వెహికల్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు.  వీఐపీలకు,స్టూడెంట్స్ కి, మిగతా వారికి వేర్వేరు ప్రాంతాల్లో పార్కింగ్ ఫెసిలిటీ కల్పించారు. ట్రాఫిక్ జామ్ లేకుండా వెహికల్స్ ను దారి మళ్లిస్తున్నారు.  వేడుకలకు హాజరయ్యే వారి పాస్‌‌లపై పార్కింగ్‌‌,కోట లోపలికి వచ్చే రూట్ గురించి పలు విధాల సూచనలు పొందుపరిచారు. హ్యాండ్‌‌బ్యాగ్‌‌లు,కెమెరాలు,టిఫిన్‌‌బాక్సులు,వాటర్‌‌బాటిళ్లపై ఆంక్షలు విధించారు. ఎంట్రీ పాయింట్స్ వద్ద పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే కోట లోపలికి పంపించేందుకు మెటల్ డిటెక్టర్స్,డోర్ ఫ్రేమ్ లను ఫిక్స్ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు, వెహికల్స్ దారి మళ్లింపుతో పాటు సెక్యూరిటీ విధివిధానాలను సీపీ అంజనీకుమార్ మంగళవారం వెల్లడించే అవకాశమున్నట్టు పోలీస్ అధికారులు చెబుతున్నారు.

కమాండ్ కంట్రోల్ రూమ్ లో పర్యవేక్షణ

సీసీ కెమెరాలను స్థానికంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, బషీర్‌‌బాగ్‌‌ సీపీ ఆఫీస్ లోని కమాండ్‌‌ అండ్‌‌ కంట్రోల్‌‌ సెంటర్‌‌తో కనెక్ట్ చేశారు. సీసీ కెమెరాల ద్వారా కోట చుట్టుపక్కల రోడ్లను,వెహికిల్ మూవ్ మెంట్స్ గమనించే ఏర్పాట్లు చేశారు. దీంతో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా వారిపై నిఘా పెట్టేలా చర్యలు తీసుకున్నారు. అందుకోసం ఇన్ స్పెక్టర్ స్థాయి అధికారులు డేటా బేస్ ఆధారంగా పర్యవేక్షణ విధులు నిర్వహించనున్నారు.ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ తో సీసీ కెమెరాల ఫుటేజ్ ను కనెక్ట్ చేశారు.గోల్కొండ కోటకు చేరుకునే రోడ్లలో బాంబ్,డాగ్ స్క్వాడ్ తనిఖీలు ముమ్మరం చేశారు. కోటలోని పార్క్, సభావేదికల వద్ద స్నేక్ సొసైటీతో పాములను పట్టారు. కోట ఎంట్రీ వద్ద, ప్రధాన రూట్లలో ఎస్సై స్థాయి అధికారితో బందోబస్తు నిర్వహిస్తున్నారు.