గోషామహల్ బీఆర్ఎస్​లో వర్గపోరు

గోషామహల్ బీఆర్ఎస్​లో వర్గపోరు

బషీర్ బాగ్, వెలుగు: బీజేపీ కంచుకోటగా ఉన్న గోషామహల్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేయాలని బీఆర్ఎస్​అధిష్టానం ప్రయత్నిస్తున్న టైంలో ఆ పార్టీ లీడర్ల మధ్య ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రస్తుతం లీడర్ల వర్గపోరు తార స్థాయికి చేరింది. కొత్తగా నియమించిన బీఆర్ఎస్​నియోజకవర్గ ఇంచార్జ్ నంద్ కిశోర్ వ్యాస్( బిలాల్)కు, ఆ పార్టీ స్థానిక సీనియర్ నాయకులకు అస్సలు పడటం లేదు. ఇన్​చార్జ్​గా బాధ్యతలు తీసుకుంటున్నప్పటి నుంచి నంద్ కిశోర్ వ్యాస్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, తమను పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. 

ఇన్​చార్జ్​ఆధ్వర్యంలో ఇప్పటికే నియోజకవర్గ బీఆర్ఎస్​ఆఫీస్​కొనసాగుతుండగా, గురువారం ఆ పార్టీ లీడర్​సంతోశ్ గుప్తా మరో ఆఫీస్​ప్రారంభించాడు. మాజీ కార్పొరేటర్లు , ఉద్యమకారులు, మాజీ నియోజకవర్గ ఇన్​చార్జ్ శుక్రవారం ఓ హోటల్ లో నందకిశోర్​కు వ్యతిరేకంగా రహస్య సమావేశం నిర్వహించారు. ఇన్​చార్జ్​వ్యవహారంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గతంలో కార్పొరేటర్లుగా సేవలందించిన తమకు గుర్తింపు దక్కడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నందకిశోర్​ప్రభుత్వ కార్యక్రమాల్లో అన్నీ తానే అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమ డివిజన్లలో తమకు తెలియకుండా గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలంటే ఇన్​చార్జ్​ను మార్చాల్సిందేనని అంటున్నారు.